అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, మెక్సికో సరిహద్దు మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వలసవాదులను ఉద్దేశించి భద్రతా సిబ్బందికి హెచ్చరికలు చేశారు. కొంతకాలంగా మధ్య అమెరికాకు చెందిన వలసదారులు మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికో దగ్గర సరిహద్దు దాటే సమయంలో భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వుతున్నారు. ఈ సంఘటనలపై సమీక్ష జరిపిన ట్రంప్ మెక్సికో సరిహద్దు దగ్గర ఉండే సైనికులపై రాళ్లు రువ్వితే కాల్పులు జరుపుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వలసదారులు అక్రమంగా సరిహద్దు దాటే సమయంలో రాళ్లు విసిరతే.. వారిని కాల్చేయాలంటూ ట్రంప్ సైనికులకు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ వలసదారుల వల్ల రకరకాల ముప్పులు పొంచి ఉన్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఆర్థిక సంక్షోభం కారణంగా హోండూరస్ దేశానికి చెందిన వేలాది మంది ప్రజలు.. బ్రతుకుదెరువుకోసం అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలసవాదులను ఆందోళనకు గురి చేస్తోంది.