ప్రధాని మోడీతో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం ఇటీవలే జోనల్ వ్యవస్థలకు పలు ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసు చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. అలాగే మైనార్టీ, గిరిజనులకు పెంచిన రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు విభజన హామీల అమలులో భాగంగా.. 9, 10 షెడ్యూల్ లోని సంస్థల విభజన సమస్యలపై కూడా ప్రధానితో చర్చించారు. వీటన్నింటికీ సంబంధించి ఓ సమగ్ర నివేదికను.. కేసీఆర్.. మోడీకి అందజేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు, రైతుభీమా పథకంపై కూడా మోడీకి ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు కేసీఆర్ 4 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ దఫా.. పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్న కేసీఆర్.. ఈ నెల 17 న జరగనున్న నీతిఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు.