కాలుష్య నివారణే లక్షంగా వివిధ మార్గాల్లో ప్రయోగాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా శిలాజ ఇంధన కాలుష్యాన్ని తగ్గించేందుకు వివిధ దేశాలు పలు ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో స్వీడన్ దేశం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని వాహనాలు విద్యుత్ తో నడుస్తుండగా.. రోడ్లపై వెళ్ళేటప్పుడు కూడా వాహనాలు ఆటోమేటిక్ గా చార్జింగ్ అయ్యేలా ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది స్వీడన్ దేశం. అక్కడ స్టాక్‌హోం విమానాశ్రయం నుంచి రోజెర్స్‌బెర్గ్ వరకూ ఉన్న రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా వాహనాలు చార్జింగ్ అయ్యేలా ప్రత్యేకమైన ట్రాక్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. దాదాపు 2 కి.మీ పొడవుతో రోడ్డు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేసింది స్వీడన్ ప్రభుత్వం. ఈ ట్రాక్ మధ్యలో 6 సెం.మీ లోతులో విద్యుత్ వైర్లను అమర్చారు. దీంతో విద్యుత్‌తో నడిచే ప్రత్యేకమైన కారు లేదా లారీ ఈ మార్గంపైకి రాగానే దాని కింద ఉండే ప్రత్యేకమైన నిర్మాణం ఆటోమేటిక్‌గా విద్యుత్ ట్రాక్‌ను గుర్తించి చార్జింగ్ ప్రారంభిస్తుంది. కారు లేదా ట్రక్కు వెళుతున్నంతసేపు వాహనాల బ్యాటరీలు చార్జ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ వాహనం నిలిచిపోతే, విద్యుత్ సరఫరా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. భవిష్యత్ లో దేశమంతటా ఈ తరహా పద్దతిని అమలు చెయ్యాలని స్వీడన్ ప్రభుత్వం భావిస్తోంది.