పుట్టపర్తి నారాయణాచార్యులు జగమెరిగిన సరస్వతీ పుత్రుడు. శివతాండవాన్ని దర్శించి , పద్యాల్లో శ్లోకాల్లో బంధించినవాడు. చిన్నతనంలో తను సరదాగా రాసుకున్న పద్యకవిత్వం , పెద్దయ్యాక తనకే డిగ్రీ పాఠంగా ఎదురయిన ఏకైక కవి. అనేక భాషల్లో చేయితిరిగినవాడు. తెలుగును మించి సంస్కృతం, ఇంగ్లీషులో కూడా వెలుగులు విరజిమ్మినవాడు.
సాధారణంగా తమ కావ్యాలకు పేరున్న పెద్ద కవులచేత ముందుమాట, అభిప్రాయం రాయించడం ఆనవాయితీ. పుట్టపర్తి వారు ఒక చిన్ని పద్య కావ్యానికి, చిన్ని పద్యం ముందుమాటగా ఆయనే రాసుకున్నారు.
పద్యం
నవ్యతరమయిన గాన స్రవంతికొకడు తలయూచు, మరియొకడోసరించు -
వీణదే దోషమో, లేక వినెడివాడి తప్పిదమో ?
అర్థం
ఒక సరికొత్త, నవనవోన్మేషమయిన గాన లహరికి - ఒకడు భళి భళీ అన్నాడు. మరి ఒకడేమో అసలేమీ బాగాలేదు అన్నాడు. ఈ సందర్భంలో దోషం వీణదా ? విన్నవారిదా ?
అంతరార్థం
విన్నవారే తమ స్థాయిని పెంచుకుంటూ పోవాల . వీణ లేదా వీణ వాయించేవారు రాళ్లు కరిగించే గానమే ప్రవహింపజేసినా, దానిని గుర్తించి , స్వీకరించి , ఆనందించేవారు లేకపోగా - బాగలేదు అని తల అడ్డంగా ఊపితే వీణ హృదయం బద్దలయి, తీగలు తెగి ఎంతగా విలపిస్తాయో ఆలోచించమంటున్నారు పుట్టపర్తి వారు.