హ్యాకర్లు పాకిస్థాన్ ను చావుదెబ్బ కొట్టారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై హ్యాకర్లు పంజా విసరడంతో దాదాపు అన్ని పాకిస్థానీ బ్యాంకులు హ్యాక్ కు గురయ్యాయి.. మొత్తం 22 పాకిస్థానీ బ్యాంకులకు చెందిన సమాచారాన్ని హ్యాకర్లు మార్కెట్లో అమ్ముకున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకున్నట్లు పాకిస్థాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సంస్థ భావిస్తోంది. సుమారు 8 వేల మంది ఖాతాదారుల సమాచారం హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డులు హ్యాక్ కు గురవుతున్నట్టు సమాచారం రావడంతో ముందుగానే పది కీలక బ్యాంకులు ఆర్ధిక లావాదేవీలను నిలిపివేసింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఏకంగా బ్యాంకుల్లో సమాచారం, క్రెడిట్, డెబిట్ కార్డులు హ్యాక్ అవుతుండటంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాకింగ్ దాటికి ఆన్‌లైన్ మార్కెటింగ్ కూడా బంద్ అయింది. కాగా దాదాపు అన్ని బ్యాంకులు హ్యాకింగ్‌కు గురైనట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన సైబర్ నేరాల విభాగం తెలిపింది. ఖాతాదారుల సొమ్ము భారీగా దొంగతనానికి గురైనట్లు వెల్లడించింది. మరోవైపు దేశంలోని బ్యాంకులపై హ్యాకర్లు దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు స్పందించింది. బ్యాంకింగ్ వ్యవస్థ హ్యాకింగ్‌కు గురి కాలేదని స్పష్టం చేసింది.