ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ఏపీలో ఒక పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పెద్దపార్టీలు మెజార్టీ ఓట్లను కైవసం చేసుకునేందుకు రేసుగుర్రంలా పరుగెడుతుంటే.... ఓ పార్టీ మాత్రం విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. అన్ని పార్టీలు మహిళలకు గాలెం వేస్తుంటే... ఈ అప్‌కమింగ్ పార్టీ మాత్రం మగవాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇదేందో జంబలకడిపంబ పార్టీ అనుకుంటే సిగ్గులో కాలేసినట్లే. అసలు మ్యాటరేంటే గృహహింస నిరోధక చట్టం ద్వారా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న మగవాళ్లు ఓ భార్య బాధితుల పార్టీని స్ధాపిస్తున్నారు.
రెండు హృదయాలు, మూడుముళ్లు, ఏడడుగులు.. నూరేళ్లపాటు భార్యాభర్తల బంధాన్ని కలిపి ఉంచుతాయంటారు. నాతిచరామి అంటూ ప్రమాణం చేసింది మొదలు పెళ్లిపుస్తకంలోని చివరిపేజీ వరకు నమ్మక మే వివాహజీవితాన్ని నడిపిస్తుందని నమ్ముతున్నాము. కానీ కారణాలేవైనా చాలా ఇళ్లలో చీటికీమాటికీ గొడవలు ప్రశాంతతను చెదరిపోవడంతో చివరకు పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కేస్తున్నారు. దీంతో భార్య వల్ల అన్యాయంగా బాధపడుతున్న భర్తలకు ఎక్కడ న్యాయం జరగకపోవడంతో.... తమ హక్కులను కాపాడుకునేందుకు ఏకంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధమయ్యారు.
భార్యలు, ఆడపడుచులు, అత్త మామ వేదింపుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు భార్య బాధితులు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు భార్యబాధితులు వాపోతున్నారు. ఇప్పటికే భార్య బాధితుల సంఘాలు ఉన్నా ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఓ పార్టీని పెట్టుకొని తమహక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మానసిక హింసకు గురవుతోన్న ఎంతోమంది మగవారికి రక్షణ కల్పించడంతో పాటు వారికి అండగా నిలవడానికే ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు చెబుతున్నారు.