ఎవరైనా దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటే ఇష్టపడతారు. కానీ నల్లగా గారపట్టి ఉంటే మాత్రం వారినేదో తప్పుచేసినట్టు చూస్తారు. కానీ వాస్తవంగా దంతాలు ఏ దేశంలోనైనా తెల్లగానే ఉంటాయి.. ఉండాలి కూడా.. కానీ కొందరు అమెరికా యువతులు మాత్రం దంతాలు తెల్లగానే ఎందుకుండాలి..? నీలం, ఎరుపు, ఇంద్రధనస్సు రంగుల్లో ఉంటే తప్పేంటి అన్న రీతిలో ఉన్నారు. ఈ తరహా పద్ధతి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. పలురకాల లిప్‌స్టిక్స్ వేసుకుంటున్నప్పుడు..వాటికి తగ్గట్టుగా రంగురంగుల దంతాలు కూడా ఉండాలనే ఆలోచనతో క్రోమ్ అనే బ్యూటీ సంస్థ ఈ తరహా ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.
అమెరికాకు చెందిన ఈ బ్యూటీ సంస్థ రెయిన్‌బో టూత్ పేరిట నెయిల్ పాలిష్ లాగే టూత్ పాలిష్‌ను ప్రమోట్ చేస్తోంది. ఇది అచ్చం నెయిల్ పాలిష్ ఆకారంలో ఉంటుంది. దీనిని వివిధ రకాల లిప్‌స్టిక్స్ వేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా దంతాలకు రాసుకుంటే మెరిసిపోతాయి. ముఖ్యంగా ఇవి పింక్, నీలం, బంగారు, వెండి, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఇది ఏమాత్రం మనిషికి హానికరం కాదని ఆ సంస్థ చేస్బుతోంది. ఈ టూత్ పాలిష్ ను ఒక్కసారి రాసుకుంటే 24 గంటల పాటు ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు టెకాషిని స్ఫూర్తిగా తీసుకుని డేవిడ్ సిల్వర్‌స్టీన్ ఈ టూత్ నెయిల్‌పాలిష్‌లను రూపొందించారు. ఈ ట్రెండ్ యువతకు తప్పకుండా నచ్చుతుందని అయన అంటున్నారు.