Solutions for White Hair: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే దీనికి కారణాలు ఏంటో తెలుసా?
Solutions for White Hair Problems: ఆడవారికైనా, మగవారికైనా జుట్టే అందం అంటుంటారు. అలాంటి జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం కదా మరి. ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వెంటాడుతున్న సమస్య తెల్ల జుట్టు. 10 ఏళ్ల పిల్లల నుంచి యువతి యువకుల వరకు తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. అయితే చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడటానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
జుట్టు త్వరగా తెల్లబడటానికి వారసత్వం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ముందే జాగ్రత్త పడి తగిన చిట్కాలు పాటిస్తే.. జుట్టు త్వరగా తెల్లబడకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు. ఈ మధ్య కాలంలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారిలో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. అవి జుట్టుకు ఉన్న నలుపు రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గిపోయేందుకు దారి తీయడంతో తెల్ల జుట్టు ఏర్పడే అవకాశం ఉంటుందంటున్నారు.
శరీరానికి కావాల్సిన విటమిన్లు అందకపోవడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన విటమిన్లు, మినరల్స్ లేకపోవడం ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, కాపర్, జింక్ వంటి పోషకాలు అందకపోతే.. వెంట్రుకల కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి సరిగా జరగక జుట్టు తెల్లగా మారుతుందని అంటున్నారు.
స్మోకింగ్ ఎక్కువగా చేసేవారిలో జుట్టు త్వరగా తెల్లబడుతుందని చెబుతున్నారు. సిగరెట్ల ద్వారా శరీరంలో చేరే విష పదార్థాలు మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే దీనికి కారణమంటున్నారు. శరీరంలో ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల మధ్య సమతుల్యత లేకపోవడం వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుందని దీని వల్ల వైట్ హెయిర్ వస్తుందంటున్నారు. జుట్టుపై నేరుగా ఎక్కువ సేపు ఎండపడడం, దుమ్ము, ధూళి కాలుష్యం వంటివి శరీరంలో యాక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతాయి. దానితో జుట్టు త్వరగా తెల్లబడుతుందంటున్నారు.
థైరాయిడ్, రక్తహీనత సమస్యలు ఉన్నవారిలోనూ ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. హార్మోనల్ సమస్యలు మరో కారణంగా చెబుతున్నారు. స్త్రీలలో యుక్త వయస్సుకు రావడం, గర్భం దాల్చడం వంటి సమయాల్లో మార్పు వస్తుంది. ఈ హర్మోన్ల స్థాయిలు సరిగా లేకుంటే.. వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు తీవ్ర గాఢత ఉండే షాంపూలు ఎక్కువగా వాడటం.. తరచూ జుట్టుకు రంగు వేయడం వంటి వాటి వల్ల కూడా వెంట్రుకల కుదుళ్లు దెబ్బతింటాయని చెబుతున్నారు. మెలనోసైట్స్ సరిగా ఉత్పత్తికాక.. తెల్ల జుట్టు వస్తుందని అంటున్నారు.