Health Tips: రోజూ ఉదయం ఈ నీరు తాగితే.. శరీరంలో జరిగే మార్పలివే..!
Health Tips: ప్రస్తుతం ఆరోగ్యంపై చాలా మంది అవగాహన పెరిగింది. ముఖ్యంగా కరోనా పరిస్థితుల తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన అందరిలోనూ మొదలైంది.
Health Tips: ప్రస్తుతం ఆరోగ్యంపై చాలా మంది అవగాహన పెరిగింది. ముఖ్యంగా కరోనా పరిస్థితుల తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన అందరిలోనూ మొదలైంది. దీంతో సహజ సిద్ధమైన చిట్కాలను ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఓ చిట్కా గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఉప్పు అనగానే మనలో చాలా మంది మొదట భయపడుతారు. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుందని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఉప్పు కారణమనే ఫీలింగ్‌లో ఉంటారు. అయితే ఉప్పును అస్సలు తీసుకోకపోయినా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉప్పులో ఉంటాయని అంటున్నారు. అలాంటి ఉప్పును రోజూ ఉదయం పడగడుపున నీటిలో కలుపుకొని తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.
రోజు ఉదయం గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఉప్పును కలిపి తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడంలో దోహదపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఉప్పు కలిపిన నీరు బాగా ఉపయోగపడుతుంది. నీటిలో ఉప్పు కలుపుకొని తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా ఉప్పు నీరు ఉపయోగపడుతుంది. ఉప్పు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలోని యాసిడ్ బ్యాలెన్స్ అవుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు మొదలైన ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో కూడా ఉప్పు కలిపిన నీరు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఉప్పు నీరు సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఉప్పు కలిపిన నీటిని తీసుకుంటే మూత్రపిండాలు,కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఉప్పు చాలా పరిమితంగా కలుపుకోవాలి. అలా కాకుండా ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
నోట్: ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.