Winter Tips for Good Health: ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే మంచిదని కూడా తెలుసు. కానీ శీతాకాలంలో కొన్ని రకాల ఆకు కూరలు తినకూడదని మీకు తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు కొన్ని రకాల ఆకు కూరలు తినడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో, ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
శీతాకాలం కావడంతో మార్కెట్లో రకరకాల తాజా ఆకుకూరలు కనిపిస్తుంటాయి. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, ప్రోటీన్లు, మినెరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. కాని కొన్ని ఆకుకూరలను చలికాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
బచ్చలికూర ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు అవుతాయని చెబుతున్నారు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఆకు కూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది ఆ సమస్యను మరింత తీవ్రం చేస్తుందంటున్నారు. అలెర్జీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు కూడా శీతాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే అందులో ఉండే ఆక్సిలేట్స్ అనే సమ్మేళనం సమస్యను మరింత ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అందుకే ఆకుకూరను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అధిక రక్తపోటులో బాధపడేవారు ఆకు కూరలు ఎక్కువగా తినకూడదని అంటున్నారు. ఇవి ప్రయోజనానికి బదులుగా మరింత హాని చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వారు వైద్యుల సలహా మేరకు ఆకు కూరలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.