మోకాళ్ల నొప్పులు వచ్చాయంటే ఎవరికైనా బాగా ఇబ్బందిగానే ఉంటుంది. సరిగ్గా కూర్చోలేరు. నిలబడ లేరు. నడవలేరు. అయితే వయస్సు మీద పడడం వల్ల వచ్చే మోకాళ్ల నొప్పులు సహజమే అయినా కొందరిలో పోషకాహార లోపం, శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో అలా వచ్చే మోకాళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే చాలు. దాంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని దాన్ని మరిగించాలి. అందులో ఒక టీస్పూన్ కర్పూరం పొడిని వేసి బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మోకాళ్లపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కొద్దిగా వాము తీసుకుని దాన్ని నీటి సహాయంతో మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో నొప్పులు తగ్గిపోతాయి.
3. కొద్దిగా ఆముదం నూనెను తీసుకుని వేడి చేయాలి. ఆ వేడి నూనెను మోకాళ్లపై రాయాలి. అనంతరం వేడి నీటితో కాపడం పెట్టాలి. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
4. కొద్దిగా పసుపును తీసుకుని నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాన్ని మోకాళ్లపై రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు తగ్గుతాయి.
5. కొన్ని ఐస్‌ముక్కలను తీసుకుని ఒక కవర్‌లో వేసి మోకాళ్లపై ఆ ప్యాక్‌ను ఉంచాలి. దీంతో మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.