ఎండ తాపాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాల్లో పుదీనా కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఈ కాలంలో ఎక్కువుగా వాడుతుంటాం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే...
1. వేసవి కాలంలో బయట ఆహారం పడనప్పుడూ, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అరుగుదల తగ్గుతుంది. అలాంటప్పుడు గ్లాసు నీళ్లలో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి తీసుకోవాలి. రుచిగా ఉండాలంటే కాస్త తేనె వేసుకుంటే చాలు. ఇలా తీసుకున్నప్పుడు పుదీనా లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థలో మేలు చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. ఇవి అరుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి.
2. ఎండలు మండుతున్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. అలానే శరీరంలో వ్యర్దాలు చేరి పోయి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిని దూరం చేసుకోవాలంటే పుదీనాతో ఇలా చేసి చూడండి. ఓసీసాలో నీళ్లు తీసుకొని అందులో కీరదోస ముక్కలు రెండు చక్రాల్లా తరిగిన నిమ్మముక్కలు నాలుగు పుదీన ఆకులు వేసి రాత్రి పూట ఉంచాలి. మర్నాడు ఈ నీళ్లను తాగుతూ ఉంటే డీహైడ్రేషన్ ఇబ్బంది పెట్టదు. శరీరానికి హాయిగా ఉంటుంది. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పానీయం ఉపయోగపడుతుంది.
3. వేసవిలో బయటకు వెళితే వడదెబ్బ తగలడం, నీరసం, అలసట సహజంగానే ఎదురవుతాయి. అలాంటప్పుడు పుదీనా నీళ్లు తాగితే చాలా మంచిది. నీళ్ల కుండలో కొన్ని ఆకులు వేసుకోవచ్చు. లేదంటే ఐస్ ట్రేల్లో కాసిని నీళ్లుపోసి పుదీనా రసం వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐసు ముక్కలుగా మారాక వీటిని మంచినీళ్లు తాగుతున్నప్పుడల్లా గ్లాసులో వేసుకొని తీసుకుంటే పుదీన పానీయం తాగినట్టు ఉంటుంది. వేసవి తాపం దూరమవుతుంది.