వాలి దెబ్బకు సుగ్రీవుడు గుహలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. హనుమ మరికొందరు సచివులు ఆయనతో ఉన్నారు. చీమ చిటుక్కుమన్నా వాలి దండెత్తి వస్తున్నాడేమోనని హడలిపోతున్నాడు. అప్పుడు అల్లంత దూరంలో రామ - లక్ష్మణులు గుహ వైపుగా వస్తున్నారు. సుగ్రీవుడి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వాళ్లెవరో కనుక్కో అని హనుమను పంపాడు. తీరా వెళ్లబోతుంటే - ఎందుకయినా మంచిది ముసలి భిక్షువు వేషంలో వెళ్లు అన్నాడు.
రామలక్ష్మణులకు ఎదురుగా వెళ్లిన హనుమ వారితో మాట్లాడిన మాటలు, మాట్లాడిన విధానం, బాడీ లాంగ్వేజ్, విషయం రాబట్టడం, విషయాన్ని నివేదించడం, సఖ్యతకు పునాది వేయడం, రాయబారిగా పనిని చక్కబెట్టడం, దూతగా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండడం, స్వామికార్య దీక్ష, స్వామి భక్తి, ఎదుటివారిని గౌరవించడం, ఎదుటివారిలో నమ్మకాన్ని పాదుకొల్పడం, అందంగా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేట్లు మాట్లాడ్డం . . .
ఈ మాటలన్నీ వాల్మీకి చెబితేనే వినాలి.
ఎక్కడ ఏమి మాట్లాడాలో - ఏమి మాట్లాడకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానికి రామాయణం దారి దీపం.