గోవా, మణిపూర్‌ ప్లాన్‌ కర్ణాటకలో వర్కవుట్‌ అవుతుందా?

Update: 2018-05-16 05:28 GMT

కర్ణాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ భారీ ప్రయత్నమే చేస్తోంది. గతంలో గోవాలో, మణిపూర్ లో అనుసరించిన వ్యూహాన్నే తిరిగి అమలు చేయాలనుకుంటోంది. నాడు ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2017 ఫిబ్రవరి 4న గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ మొత్తం40 అసెంబ్లీ స్థానాలున్నాయి.  ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే గెలిచింది. మరో వైపున 17 స్థానాల్లో   కాంగ్రెస్ గెలిచింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ 3 సీట్లను గెలుచుకుంది.  గోవా ఫార్వర్డ్ పార్టీ  3సీట్లలో విజయం సాధించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలిచింది.  ముగ్గురు  స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి నాయకుడిని ఎన్నుకోవడం లో, గవర్నరును కలుసుకోవడంలో జాప్యం చేసింది. ఈ లోగా బీజేపీ తన వ్యూహం అమలు చేసింది.  కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తనకు మొత్తం 21 మంది సభ్యుల మద్దతు ఉందని చెబుతూ, వారి లేఖలతో గవర్నర్ ను కలిశారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ కి చెందిన మొత్తం ఆరు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఆయనకు మద్దతు తెలిపారు. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు.  పదిహేను రోజుల్లోగా మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ బీజేపీ నాయకుడు, ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను ఆదేశించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కోర్టుకు వెళ్ళినా లాభంలేకపోయింది. మెజారిటీ ఉంటే ముందుగానే ఎందుకు నిరూపించుకోలేకపోయారని కోర్టు ప్రశ్నించింది. 

మణిపూర్ విషయంలోనూ ఇదే విధంగా జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ తన మంత్రాంగంతో అధికారాన్ని  చేజిక్కించుకుంది. మణిపూర్ లో మొత్తం స్థానాలు 60. కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 21స్థానాలు మాత్రమే సాధించింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో గెలిచింది. నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా 4 స్థానాల్లో విజయం సాధించింది.  లోక్ జనశక్తి పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం గెలిచాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. చివరి క్షణంలో అక్కడి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఈ రాష్ట్రం కూడా బీజేపీ ఖాతాలోనే చేరిపోయింది. 4 స్థానాలున్న  నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీపీ), ఒక స్థానమున్న మిత్ర పక్షం ఎల్జేపీ బీజేపీకి మద్దతు పలికాయి. మరో 4 స్థానాలున్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) కూడా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలికింది.   అదే సమయంలో టీఎంసీకి చెందిన ఒకే సభ్యుడు, కాంగ్రెస్‌ నుంచి మరో సభ్యుడు  బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 21 నుంచి మొత్తం 32 సీట్లకు చేరింది. దాంతో మణిపూర్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అధిష్ఠానం ఆదేశాలతో  రంగంలోకి దిగిన బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌ చక్రం తిప్పారు.  ఇంఫాల్‌లోనే మకాం వేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. 


 

Similar News