చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బీజింగ్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంగ్జియా కవు నగరంలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. దాంతో 22 మంది మంటల్లో సజీవదహనమయ్యారు. మరో 17 మంది గాయపడినట్టు ఆ దేశ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఈ పేలుడుపై ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. మంటల ధాటికి ఫ్యాక్టరీకి సమీపంలో నిలిపి ఉంచిన 50 వాహనాలు దగ్ధమయ్యాయని.. ఈ ప్రమందంలో 22 మంది చనిపోయినట్టు ధృవీకరించింది. ఇక మంటలు దావానంలా వ్యాపించి సమీపంలో గోడౌన్లకు పాకాయి. దాంతో ట్రక్కులు మంటల్లో కాలిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రమాదకరమైన రసాయన పదార్థాన్ని తీసుకొస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.