బాల్యం.. స్వేచ్ఛాప్రపంచం. హద్దుల్లేని ఆలోచనల స్రవంతి..ఆ రేపటి పౌరులను.. వారి ఆలోచనా ప్రవాహాన్ని సరైన మార్గంలోకి మళ్లించడమే ఇప్పుడు పెద్ద సమస్య. తీరికలేని తల్లిదండ్రులు తీరికయ్యాకా చూసేసరికి పిల్లలు పెద్దలైపోతున్నారు. పెద్ద సమస్యగా మారిపోతున్నారు. ఆడేపాడే వయసులోనే వారు మంచీచెడు నేర్చుకుంటారు. తప్పటడుగులు వేసేటప్పుడే నడక నేర్పాలి. పడిపోయినప్పుడే నిలబెట్టాలి. ఒరిగిపోతున్నప్పుడే ఆసరా ఇవ్వాలి. అన్నీ అయ్యాక అయ్యో అంటే లాభం లేదు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాకపోతే బిజీ జీవన విధానంలో పెద్దలు ఇవేవీ పట్టించుకోకపోవడమే పిల్లలకు శాపంగా మారుతోంది. ఆధునిక జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానం మేలు ఎంత చేస్తోందో.. కీడు కూడా అంతే ఉంటోంది. పెద్దలు సరిగ్గా వ్యవహరిస్తే, పిల్లలకు అండగా నిలిస్తే వారు నిజంగా అద్భుతాలే సృష్టిస్తారు. పిల్లలు కాదు పిడుగుల్లా మారిపోతారు. చిన్న కుటుంబాలు, ఒక్కగానొక్క సంతానం, గడపదాటకుండా ఆటలు, అంతర్జాలపు మాయాజాలంలో ఇరుక్కుపోవడం పిల్లల మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతోంది.
అనుబంధం, అనురాగం, ఆత్మీయత, వాత్సల్యం చూపించే తల్లిదండ్రులు తమకున్నారనే భరోసా లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక పిల్లలు చురుకుదనాన్ని కోల్పోతున్నారు. స్నేహితులను నమ్మి, వారు చూపించే మార్గంలో పయనించడం మంచిదో కాదో నిర్ణయించుకోలేక తమ బంగారు బాల్యానందాల్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారు. రేపటి పౌరులుగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిందిపోయి తమకు ఎవరూ లేరనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి మానసిక స్థితిలో ఉన్న పిల్లలు తమకు ఆహ్లాదాన్నిచ్చేది కేవలం ఇంటర్నెట్ అనే భావనలో ఉంటున్నారు. ఇంటర్నెట్ గేమ్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఆప్స్‌పై ఆధారపడి ఎటు వెళ్తున్నారో తెలియని అయోమయ స్థితిలో ఇంటిని, పరిసరాలను, చదువును మర్చిపోయి దానిపైనే కూర్చుని తమ విలువైన ఆరోగ్యాన్ని, కాలాన్ని, భవిష్యత్‌ను వృథా చేసుకుంటున్నారు. భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మన నేతలు చిలుకపలుకులు పలుకుతున్నారు. మన భవిష్యత్ తరం నెట్టింట్లో అవసరమైనవి, అనవసరమైనవి చూస్తూ వృథా కాలక్షేపం చేస్తున్నారు. దీనికంతటికీ సాంకేతిక విప్లవమే కారణం అంటే ఒప్పుకోనక్కరలేదు. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించకపోవటమే ప్రధాన సమస్య. ఇక్కడే పెద్ద తంటా వస్తోంది. ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద, పేద, గొప్ప అనే తేడాలేకుండా ప్రతివారి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఈరోజుల్లో స్మార్ట్ఫోన్‌ని స్మార్ట్‌గా వాడాలన్నది కనిపెట్టిన వాడి ఆలోచన. కాని మన ఉనికిని మర్చిపోయేంతగా దానిలో లీనమైపోయి జబ్బులు తెచ్చుకుంటోంది నేటి యువతరం. ఇక ఫోన్‌లో గేమ్స్ మాటకొస్తే చిన్న, పెద్ద అందరూ దానికి బానిసలైపోతున్నారు.
ఇప్పుడున్న స్పీడ్ యుగంలో కేవలం చదువు ఒక్కటే కాకుండా పిల్లలకు వివిధ రకాలైన ఆహ్లాదాన్ని కలిగించే ఆటలు, సంగీతం, డాన్స్, చిత్రలేఖనం, మైమింగ్ వంటి కళల్లో కూడా ప్రోత్సహించే విధంగా స్కూళ్లలో కరిక్యులమ్ తయారు చేయాలి. దాన్నిబట్టి వారికి ఎటువైపు ఆసక్తి మెండుగా ఉందో ఉపాధ్యాయులతో పాటు ఇంట్లోని తల్లిదండ్రులకు కూడా తెలిసే అవకాశాలుంటాయి.
తల్లిదండ్రులు తమ సమయాన్ని కేటాయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే టెక్నాలజీలో తల్లిదండ్రులకన్నా పిల్లలే ముందుంటున్నారు. కనుక డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకోకుండా డబ్బు కన్నా కన్నపిల్లలు ముఖ్యమనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. కావలసినవి ఇస్తూనే ఒక కంట కనిపెట్టడం తల్లిదండ్రులుగా మన కనీస బాధ్యత. అప్పుడప్పుడూ వారిని బయటకు తీసుకెళుతూ దేనిపట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నారో తెలుసుకోవాలి. ఇంట్లోనే ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారో వారినే అడుగుతూ ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఆసక్తి ఉన్నట్లు నటిస్తూ ఎలా ఆడాలి అనే విషయాలను తెలుసుకోవడం వల్ల ఆ ఆటల పట్ల తల్లిదండ్రులకు కూడా అవగాహన కలగడమే కాకుండా ఒకవేళ ప్రమాదకరమైనవి అయితే ముందుగా వారిని హెచ్చరించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వారితో ప్రేమగా వ్యవహరిస్తూ చెయ్యాలి తప్ప వారిపై నిఘా ఉన్నట్లు ప్రవర్తిస్తే తప్పుదోవ పట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కుటుంబం, సమాజం వారికి అండగా లేదనే బాధతో బంగారు భవిష్యత్‌ను చూడాల్సిన పిల్లలు మొగ్గలుగానే రాలిపోతుంటే దానికి బాధ్యులు తల్లిదండ్రులా? వారి ఒంటరితనమా? మేమున్నామనే ఆపన్న హస్తం అందించే వారి భరోసా లేకపోవడమా? నేటి పిల్లలు బాల్యాన్ని మర్చిపోయి తమదైన నెట్ లోకంలో బతికేస్తున్నారు.
నేటి ఖరీదైన రోజుల్లో ఒక్కరైతే చాలు అనుకుంటూ వారికి తోడుగా ఎవరూ లేకుండా చేస్తున్నారు. అందుకే వారితో స్నేహంగా మెలగాలి. నవమాసాలు మోసి కన్న ఆ తల్లికి జీవించినంత కాలం తనకు తాను వేసుకున్న శిక్షే అవుతుంది.