ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన ఓ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'కర్ణాటక ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరి.. రాహుల్ గాంధీకి అండగా ఉంటా. భారత్‌ను మెరుగైన స్థితికి చేర్చేందుకు ఈ నిర్ణయం. ఇంతపెద్ద అడుగు వేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై ఆయన అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. 'ఇప్పటివరకు మీ పుస్తకాలు చదివా. ఇక నుంచి అవన్నీ వదిలేస్తా.' అంటూ ఓ అభిమాని రీట్వీట్ చేయగా, మరో అభిమాని.. 'మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నా. మీరు కాంగ్రెస్‌లో చేరితే అన్‌ఫాలో అవుతా' అంటూ తేల్చి చెప్పేశాడు.
డూడ్ నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది'.. 'మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మీలాంటి వారంతా వచ్చి అసలైన కాంగ్రెస్ విలువలను నిలబెట్టాలి'.. 'ఇది పప్పు దినం మనం నమ్మాల్సిందే' అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ట్వీట్లు కూడా నమ్ముతున్నారా? అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా, ట్వీట్ చివరిలో మరిన్ని వివరాల కోసం అంటూ చేతన్ ఓ లింక్‌ను జతపరిచారు. దానిని క్లిక్ చేస్తే ఏప్రిల్ ఫూల్స్ డే అంటూ వికీపీడియా పేజ్ తెరుచుకుంటోంది. దీన్ని బట్టి ఇదంతా ఏప్రిల్ 1న ఫూల్స్‌డే సందర్భంగా ఆయన చేసిన సరదా ట్వీట్ అని అర్థమవుతోంది.