వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ..తాము బీజేపీ తో కుమ్మక్కయ్యామని అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. బీజేపీ కుమ్మక్కైతే హస్తినలో ఆమరణ దీక్ష చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రం అంతా వైసీపీ ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తుంటే చంద్రబాబు ఆనంద నగరాల పేరుతో వేడుకలు జరపడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు.
అంతేకాదు ఏపీ ప్రభుత్వ పథకాలపై 71శాతం సంతృప్తి ఉందని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ నేతలు రైతులు అప్పుల పాలైనందుకా..? ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా లేనందుకా..?ఏ విషయం లో ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రోజా నిలదీశారు. వైఎస్ అంటే కిలో బియ్యం, ఆరోగ్య శ్రీ , ఉచిత కరెంట్ పథకాలు గుర్తుకు వచ్చేవి. మరి చంద్రబాబు గురించి చెప్పుకోవడానికి ఏమీలేవని సూచించారు. హోదాను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు ఆనంద నగరాలని మరో నాటకానికి తెరతీశారని మండిపడ్డారు.
ప్రజలంటే సీఎం పాలన గురించి పొగుడుతారు. కానీ చంద్రబాబు తన పాలన గురించి తానే పొగుడుకుంటుంన్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రజలు బాధల్లో ఉంటే చంద్రబాబు ఆనంద నగరి చేస్తానని చెబుతున్నా.. టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని రోజా ఆరోపించారు. చంద్రబాబు ఏప్రిల్ 30న తిరుపతిలో సభ పెట్టి కేంద్రాన్ని నిలదీస్తామంటూ కొత్త నాటకానికి తెరతీస్తున్నారని రోజా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తానన్న పవన్.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం 2కి.మీల పాదయాత్ర చేయడం అభినందనీయమని అన్నారు. ఈ పోరాటాన్ని ఆయన కొనసాగిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. కీలక పదవుల్లో ఉండికూడా వెంకయ్య నాయుడు ప్రధానిని ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడగరని, అలాగే సీఎం చంద్రబాబు.. వెంకయ్యను హోదా గురించి అడగరని అన్నారు.