అజామీలోపాఖ్యానం

Update: 2018-01-18 09:45 GMT

అజామీళుడు మంచి ధార్మిక కుటుంబంలోనే పుట్టాడు. కానీ చిన్నతనంలోనే దారితప్పాడు. ఇల్లూవాకిలి మరిచి చెడు తిరుగుళ్లు తిరిగాడు. 80 ఏళ్లు దాటాక మంచాన పడ్డాడు. దాదాపు నోట మాటకూడా పెగలడం లేదు. యమభటులు వచ్చి వాకిట్లో నిలుచున్నారు . అజామీళుడికి చివరి కొడుకుమీద ప్రేమతో అంత్యకాలంలో 'నారాయణ ' అని కొడుకు పేరు గొణుక్కుంటూ శ్వాస వదిలాడు . 

యమభటుడి పాశానికి , విష్ణు సేవకులు అడ్డుతగిలేసరికి కథ అడ్డం తిరిగింది. నానా పాపాలు చేశాడు , ఇదిగో లిస్టు , యమలోకం ఇతడికి యమయాతనలు పెట్టడానికి ఆవురావురుమని నిరీక్షిస్తోంది - అన్నది యమభటుడి వాదన . 

నారాయణ - అని కన్నుమూశాడు కాబట్టి - స్వర్గానికే వెళ్ళాలి - ఇది నారాయణుడి ఆజ్ఞ - అన్నది విష్ణు సేవకుడి వాదన . 

వీడు చివర స్మరించింది విష్ణువును కాదు - వీడి చివరి కొడుకు పేరు - మా సాఫ్టువేర్ ఎప్పుడూ తప్పుకాదు , చిత్రగుప్తుడే స్పృహదప్పి పడిపోయాడు వీడి పాపాల చిట్టా చూసి , యమలోకంలో ఉన్న అన్ని శిక్షలూ అర్జంటుగా వీడికి వేయాలి వదులు స్వామీ అని యమభటుడు వాదించాడు . 

ఏమో మాకవన్నీ అనవసరం . చివర నారాయణ అనడంతో ఆ పాపాలన్నీ భస్మమయిపోయాయి , ఇప్పుడు ఇతడు వైకుంఠానికి అతిథి - అంటాడు విష్ణుసేవకుడు . 

చేసేది లేక యమభటుడు వట్టిచేతులతో వెనక్కు వెళ్లి - చిత్రగుప్తుడికి , యముడికి జరిగిందంతా చెప్పి - మన సాఫ్టువేరుకు , ప్రోటోకాల్కు ఏదో భంగం కలుగుతోంది అని బాధపడతాడు . 

అప్పుడు యముడు నవ్వుతూ చెప్పిన మాట 

శ్రీహరి నామాన్ని ఏరూపంలో , ఏ ఉద్దేశంతో , ఎలా స్మరించినా అక్కడికి మనం వెళ్లనే కూడదు .  కలలోకూడా దైవ చింతనలేని వారి , వారి వారి బంధువులతోపాటు ఎప్పుడయినా లాక్కుని రండి పరవాలేదు . ప్రత్యేకించి శ్రీహరిని సదా స్మరించే భక్తులు కనపడితే వారి పాద ధూళిని ఒక తమలపాకు చివర పెట్టుకుని రండి , నా నెత్తిన చల్లుకుంటాను . ఆడుతూ , పాడుతూ , పొరపాటున , చివరికి ఎగతాళిగా అయినా శ్రీహరి పేరును ప్రస్తావిస్తే - వారి ఖాతాలో పుణ్యమే జమ అవుతుంది .


సరే , అజామీళుడు స్వర్గానికి వెళ్ళాడు . కథ సుఖాంతం .  అతితెలివి మనుషులు - ఈ కథలో నీతిని ఎలా పిండుతున్నారంటే - ఎన్ని పాపాలయినా చేయి , చచ్చే ముందు దేవుడిని స్మరించు - బారాఖున్ మాఫ్ - ఖేల్ ఖతం - దుకాణ్ బంద్ . 

కానీ - నిజానికి - ఈ కథ నీతి , స్ఫూర్తి అది కాదు . 

అంత్యకాలంలో - పొరపాటున కొడుకుల్లో ఒకడి పేరు నారాయణ అని అస్పష్టంగా పలవరిస్తేనే అంతటి పుణ్యం వస్తే - ఇక నిత్యం స్మరిస్తే ఎంత పుణ్యం రావాలి ? ఎంత పునీతులు కావాలి ?అన్నది మనల్ను ఆలోచించుకోమనే ఇందులో నీతి , సలహా , సూచన , బోధ .

Similar News