కరోనా కల్లోలంలో ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఏటీఎం ట్రాన్సాక్షన్ ల పై చార్జీలు ఉండవు!

Update: 2020-04-16 17:34 GMT
atm service charges SBI (representational image)

కరోనా వైరస్ దెబ్బకు ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక ఆర్ధిక పరంగా సామాన్యులు పడుతున్న కష్టాలు చెప్పనక్కర్లేదు. ఈ నేపధ్యంలో పేదలకు ప్రభుత్వాలు నేరుగా వారి ఎకౌంట్లలోకి కొద్దిపాటి మొత్తాల్ని జమచేస్తున్నాయి. వీటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఏటీఎంల నుంచి తీసుకునే సొమ్ముకు సర్వీసు చార్జీలు పడతాయనే భయంతో అందరూ బ్యాంకుల ముందు లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలి మరీ బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వారి వెతలకు చెక్ చెబుతూ దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు శుభవార్త మోసుకొచ్చింది.

ఎస్ బీ ఐ ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలు ఉండవని [ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎన్నిసార్లు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్నా అదనంగా ఎలాంటి సర్వీస్‌ ఛార్జీలు ఉండబోవని తెలిపింది. ఎస్‌బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు ఉండబోవని స్పష్టంచేసింది. ఈ వెసులుబాటును జూన్‌ 30 వరకు కల్పిస్తున్నట్టు ట్విటర్‌లో వెల్లడించింది. ఏటీఎంలకు వెళ్లినప్పుడు భౌతికదూరం పాటించాలని ఖాతాదారులకు సూచించింది.

Tags:    

Similar News