Bike Insurance: వరదల్లో మునిగిన బైకులకు ఇన్సూరెన్స్ వస్తుందా ?

Bike Insurance Claims If Damaged Due to Flood: భారీ వర్షాలు కారణంగా వరద నీరు వాహనాల్లోకి, ఇంజన్ భాగాల్లోకి వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

Update: 2024-09-02 12:32 GMT

Bike Insurance

Bike Insurance Claims If Damaged Due to Flood: భారీ వర్షాలు కారణంగా వరద నీరు వాహనాల్లోకి, ఇంజన్ భాగాల్లోకి వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా టూ వీలర్స్ ఉపయోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందువల్ల వరదల కారణంగా తమ ద్విచక్ర వాహనాలు దెబ్బతింటున్నాయి అని మొరపెట్టుకుంటున్న వారి సంఖ్య కూడా అంతే అధికంగా ఉంటోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారికి, లేదా వరద నీరు నిలిచే లోతైన మార్గాల్లోంచి రాకపోకలు సాగించే వారికి వరద కష్టాలు అస్సలే తప్పడం లేదు.

బైక్, స్కూటీల సైలెన్సర్లలోకి, ఇంజన్లలోకి వరద నీరు పోవడంతో వాహనాలు మొరాయిస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో సాధారణ రిపేర్లతో వాహనాన్ని పరిగెత్తించలేరు. ఎందుకంటే ఇంజన్ డ్యామేజ్ లేదా వైరింగ్ లాంటి ముఖ్యమైన భాగాల్లోకి నీరు చేరి వాడి కండిషన్ పూర్తిగా దెబ్బతింటోంది. అలాంటప్పుడు వాటిని స్టార్ట్ చేయాలని కూడా ప్రయత్నించొద్దు. ఆ తరువాత ఎదురయ్యే ఇబ్బందులకు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధ్యత తీసుకోవు. ఔను, వరదలో మునిగిన వాహనాన్ని వాహనదారులు సొంతంగా ఆన్ చేసేందుకు ప్రయత్నించడకూడదు అని ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు చెబుతున్నాయి.

వరదల్లో బైకులు, స్కూటీలు మునిగినప్పుడు వెంటనే ముందుగా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. వారు ఒక మెకానిక్‌ని వెంటపెట్టుకుని మీ వాహనాన్ని ఇన్‌స్పెక్షన్ చేయడానికి వస్తారు. వారు అన్నివిధాల ధృవీకరించుకున్న తరువాతే మీ వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ దరఖాస్తును అనుమతిస్తారు. లేదంటే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లికేషన్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ అవుతుంది అనే విషయం గుర్తించాలి.

ఇంతకీ వరదల్లో మునిగిన మీ టూ వీలర్‌కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా ?

వరదల్లో మునిగిన వాహనాలకు సాధారణ ఇన్సూరెన్స్‌తో క్లెయిమ్ చేసుకోలేమని అంటుంటారు. ఇంకొంతమంది తమ టూ వీలర్‌కి ఎందుకు ఇన్సూరెన్స్ వర్తించదు అని నిలదీస్తుంటారు. టూ వీలర్స్ ఉపయోగించే వారిలో చాలామందిని ఇలాంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి. మరి ఈ రెండు వాదనల వెనుకున్న అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటే అసలు మీ బైకుకి లేదా స్కూటీకి ఇన్సూరెన్స్ వస్తుందో రాదో ఒక క్లారిటీకి రావొచ్చు.

రాము బైక్ వరదల్లో నీట మునిగింది. అతడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే..

ఉదాహరణకు రాము అనే వ్యక్తి బైక్ వరద నీటిలో మునిగి డ్యామేజ్ అయింది. అది రన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో రాము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. కానీ అతడి క్లెయిమ్‌ని ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. ఎందుకంటే రాము వద్ద ఉన్నది కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో తమ సొంత వాహనాలకు జరిగే డ్యామేజీని ఇన్సూరెన్స్ కంపెనీల నుండి రాబట్టుకోలేం.

రమేష్ బైక్ కూడా అలాగే వరదల్లో నీట మునిగింది. కానీ అతడి క్లెయిమ్‌ని ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించింది...

ఎందుకంటే.. రమేష్ తన టూవీలర్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. అందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీ రమేష్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ని యాక్సెప్ట్ చేసి అతడి బైకు రిపేర్‌కి అయ్యే మొత్తాన్ని భరించింది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌కి, కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌కి మధ్య తేడా ఏంటి ?

ఒక వ్యక్తి వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి ఎదుటి వ్యక్తికి కలిగే నష్టాన్ని భర్తీ చేయడంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అదే ప్రమాదంలో గాయపడిన వాహనదారుడికి మాత్రం సింగిల్ పైసా కూడా రాదు. ఎందుకంటే ఇది కేవలం మీ వల్ల నష్టపోయిన మీ ఎదుటి వారి కోసమే పనికొచ్చే ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో మీకు కానీ లేదా మీ వాహనానికి కానీ జరిగే డ్యామేజీకి రూపాయి కూడా రాదు.

ఇక కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ విషయానికొస్తే..

ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్ల వాహనంతో పాటు వాహనదారుల భద్రత కూడా తప్పనిసరిగా కవర్ చేయాల్సి ఉంటుంది. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో పాటు ప్రమాదాలు అన్ని ఇందులో కవర్ అవుతాయి. అలాగే మీ ఎదుటి వారికి జరిగే డ్యామేజీ కూడా ఇందులో కవర్ అవుతుంది. అందుకే రమేష్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ని సదరు ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించింది.

ఈ రెండింటిలో ఏ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అధికంగా ఉంటుంది?

పిండికొద్ది రొట్టే అనే నానుడి మనం మన చిన్నప్పటి నుండి వింటుందే కదండి.. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. వాహనదారుడికి ఎక్కువ ప్రయోజనాలు అందించాల్సి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం కూడా అలాగే ఎక్కువ వసూలు చేస్తుంటాయి. అలాగని ఆస్తులేం అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సాధారణ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1000 రూపాయల్లోపే వస్తుండగా... కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ మాత్రం రూ. 1800 లకు నుండి కాస్త అటుఇటుగా ఉంటుంది.

మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 ఏం చెబుతోందంటే ?

మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 నిబంధన ప్రకారం వాహనదారుల వద్ద కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసినప్పుడు చెక్ చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి. అందుకే చాలామంది ఇన్సూరెన్స్ అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుందిలే అని సరిపెట్టుకుంటుంటారు. అంటే కేవలం ట్రాఫిక్ చలానాల బారి నుండి తప్పించుకోవచ్చు అనేది వారి ఉద్దేశం. కానీ అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే.. వాహనదారుడికి ఆ ఇన్సూరెన్స్ పాలసీ నాలుక గీక్కోవడానికి కూడా పనికిరాదు అనే విషయం వారికి తెలియదు.

యాడాన్స్ అంటే ఏంటి ?

కాంప్రెహెన్సివ్ పాలసీలో కవర్ కాని ప్రయోజనాలను పొందడానికే ఈ యాడాన్స్ ఉపయోగపడుతాయి. యాడాన్స్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర పెరుగుతుంది. కాకపోతే యాడాన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అలాగే పెరుగుతాయి అనే విషయం మర్చిపోవద్దు. యాడాన్స్ జాబితాలో చెప్పుకోదగినవి ఇంజన్ ప్రొటెక్షన్ యాడాన్, జీరో డిప్రీషియేషన్ యాడాన్, కన్సూమబుల్ కవర్ అని పలు రకాల యాడాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు యాడాన్స్ కనుక ఉన్నట్లయితే.. ఆ బైకు విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురై ఇన్సూరెన్స్‌కి వెళ్తే.. చెడిపోయిన విడిభాగాలు మార్చడం నుండి లూబ్రికెంట్స్, నట్లు, బోల్టుల వరకు అయ్యే ప్రతీ ఖర్చుని ఇన్సూరెన్స్ కంపెనీలు భరించాల్సిందే.

ఇప్పుడు మీరు చెప్పండి..

అచ్చం రాము, రమేష్ తరహాలోనే రామకృష్ణ బైక్ కూడా వరదల్లో డ్యామేజీ అయింది. అతడి వద్ద కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. వరదల్లో మునిగిన బైకుని స్టార్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. తెలిసిన రిపేర్లు ఏవేవో చేసి చివరకు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేశాడు. రామకృష్ణ వద్ద కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పటికీ అతడి బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. కారణం ఏంటో ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది. మీ ఆన్సర్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 

Tags:    

Similar News