Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదాయం కావాలా.. నెలకు రూ. 20 వేలు పొందొచ్చు

ఈ పథకంలో చేరాలంటే 60 ఏళ్లు నిండా ఉండాలి.

Update: 2024-09-07 15:15 GMT

 Pension Scheme: రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదాయం కావాలా.. నెలకు రూ. 20 వేలు పొందొచ్చు

ఒకప్పుడు పదవివిరమణ తర్వాత జీవితం గురించి పెద్దగా ఆలోచించే వారు కాదు. ప్రస్తుతం ఉద్యోగంలో చేరిన రోజు నుంచే విరమణ తర్వాత జీవితం ఎలా అనే దానిపై ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ జాబ్స్‌ చేసే వారు రిటైర్‌మెంట్ తర్వాత మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు. మారిన ఆర్థిక అవసరాలు, పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో ముందుగానే రిటైర్‌మెంట్ ప్లాన్‌ చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్‌ స్కీమ్‌.. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పథకంలో చేరాలంటే 60 ఏళ్లు నిండా ఉండాలి. అయితే డిఫెన్స్‌ ఉద్యోగులు అయితే 50 ఏళ్లకే ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్‌ స్కీమ పథకాన్ని మీకు దగ్గరల్లో ఉన్న ఏదైనా పోస్టాఫీస్‌లో ప్రారంభించవచ్చు. అధికంగా వడ్డీ లభించడం, పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని భరోసా ఉండడం వల్ల ఈ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 8.20 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు.

అయితే ఈ పథకంలో కేవలం ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెనివల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ అవుతుంది. నిజానికి తొలుత ఈ పథకంలో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. కానీ 2023 బడ్జెట్‌ సమయంలో దీనిని రూ. 30 లక్షలకు పెంచారు.

ఉదాహరణకు మీరు ఒకేసారి రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టారనుకుందాం. దీంతో మీరు ఏటా రూ. 2.46 లక్షల వడ్డీ పొందొచ్చు. ఈ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఓసారి రూ. 61,500 చొప్పున మీకు అందిస్తారు. అంటే నెలకు రూ. 20 వేలు వడ్డీ పొందొచ్చు. ఐదేళ్లు పెట్టుబడి పెడితే కేవలం వడ్డీ రూపంలోనే రూ. 10 లక్షలు పొందొచ్చన్నమాట. ఇక ఈ పథకంలో పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పాత పన్ను విధానంలో కొంత పన్ను ప్రయోజనం ఈ పథకం ద్వారా లభిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50లక్షల వరకూ పెట్టుబడులపై పన్ను ఆదా అవుతుంది.

Tags:    

Similar News