Income Tax: రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు! కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా?
Income Tax: కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది.
Income Tax: రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు! కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా?
Income Tax: కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం (న్యూ ట్యాక్స్ రిజీమ్) మరియు పాత ఆదాయపు పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్)లో బడ్జెట్ 2025లో చేసిన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్నును రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు పాత పన్ను విధానం మంచిదా లేక కొత్త పన్ను విధానం మంచిదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే, కొత్త పన్ను విధానంలో ఏ విధంగా పన్ను ఆదా చేయవచ్చు.. పన్ను చెల్లింపుదారులకు ఎంత మొత్తం ప్రయోజనం చేకూరనుంది అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానం ప్రకారం,రూ.4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. రూ.4,00,001 నుంచి రూ.8,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను వర్తిస్తుంది. రూ.8,00,001 నుంచి రూ.12,00,000 వరకు ఆదాయం ఉన్నవారు 10 శాతం పన్ను చెల్లించాలి. రూ.12,00,001 నుంచి రూ.16,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 15 శాతం, రూ.16,00,001 నుంచి రూ.20,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 20 శాతం, రూ.20,00,001 నుంచి రూ.24,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 25 శాతం , రూ.24,00,001 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది.
కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయంపై ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు. అంతేకాకుండా, జీతం పొందే వ్యక్తులకు కొత్త పన్ను విధానంలో రూ.75,000 ప్రామాణిక తగ్గింపు కూడా లభిస్తుంది. కాబట్టి, కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారు రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, వార్షిక జీతం రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల మధ్య ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో కొత్త శ్లాబు వచ్చింది, దీనిలో వారు 25 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పాత పన్ను విధానం ప్రకారం, రూ.2.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.2,50,001 నుంచి రూ.5,00,000 వరకు ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను వర్తిస్తుంది. రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు ఆదాయం ఉన్నవారు 20 శాతం పన్ను చెల్లించాలి. రూ.10,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది. పాత విధానంలో సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు, 80D కింద రూ.25,000 నుంచి రూ.50,000 వరకు, గృహ రుణ వడ్డీపై రూ.2 లక్షల వరకు తగ్గింపులు పొందవచ్చు. మీరు HRA, గృహ రుణం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడుల ప్రయోజనం పొందుతున్నట్లయితే, పాత విధానం ఇప్పటికీ లాభదాయకంగా ఉండవచ్చు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నా, గృహ రుణం చెల్లిస్తున్నా లేదా పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు ఉన్నా, మీరు పాత పన్ను విధానం గురించి ఆలోచించవచ్చు. మీ ఆదాయం రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉండి, మీరు తగ్గింపుల ప్రయోజనం పొందుతున్నట్లయితే, పాత విధానంలో పన్ను తక్కువగా ఉండవచ్చు. కొత్త విధానంలో పన్ను శ్లాబులు తక్కువగా ఉన్నప్పటికీ, మినహాయింపులు లేకపోవడం వల్ల మొత్తం పన్ను పెరగవచ్చు. కాబట్టి, పెట్టుబడిదారులు తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడుల ఆధారంగా రెండింటినీ పోల్చి సరైన ఎంపిక చేసుకోవాలి.
కొన్ని చెల్లింపులపై టీడీఎస్ పరిమితి పెంచారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితి రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెరిగింది. బ్యాంకు FDల నుంచి వడ్డీ ఆదాయం పొందే సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెరిగింది. వృత్తిపరమైన సేవలపై టీడీఎస్ పరిమితి ఇప్పుడు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెరిగింది. దీని వల్ల తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై టీడీఎస్ భారం తగ్గుతుంది.