UPI: థాయ్‌లాండ్ నుంచి నేపాల్ వరకు.. యూపీఐతో చెల్లింపులు సులభతరం! మోదీ మాస్టర్ ప్లాన్!
UPI: భారతదేశానికి చెందిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది.

UPI: భారతదేశానికి చెందిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. ఇప్పటికే అనేక దేశాలలో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిమ్‌స్టెక్ దేశాలకు భారత యూపీఐని వారి చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానం చేసే ప్రతిపాదనను అందించారు. ఈ చొరవ ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం.
బిమ్‌స్టెక్‌లో బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. యూపీఐని ఈ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సరిహద్దుల గుండా జరిగే లావాదేవీలు సులభతరం అవుతాయి. ఇది వాణిజ్యం, పర్యాటక రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్నిస్తుంది. అంతేకాకుండా, ఈ ప్రయత్నం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఈ దేశాలలో కొనసాగుతున్న భారత యూపీఐ
యూపీఐ తన విజయంతో ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటోంది. ప్రస్తుతం భూటాన్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్ సహా ఏడు దేశాలలో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. భీమ్, ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి 20కి పైగా అప్లికేషన్‌లు ఈ అంతర్జాతీయ లావాదేవీలకు మద్దతునిస్తున్నాయి. యూపీఐ ఇప్పటికే ప్రారంభించబడిన దేశాలలో దాని వినియోగాన్ని మరింత పెంచడంపై ప్రస్తుతం దృష్టి సారించామని అధికారులు తెలిపారు.
యూపీఐ ద్వారా ఎంత లావాదేవీలు జరిగాయంటే
ఒక నివేదిక ప్రకారం, 2024 ద్వితీయార్థంలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 42 శాతం పెరిగి 93.23 బిలియన్లకు చేరుకుంది. వరల్డ్‌లైన్ 2024 ద్వితీయార్థపు ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ ప్రకారం.. వాల్యూమ్, ధరల పరంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి మూడు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. లావాదేవీల వాల్యూమ్ పరంగా, డిసెంబర్ 2024లో మొత్తం లావాదేవీలలో ఈ మూడు యాప్‌ల వాటా 93 శాతంగా ఉంది. లావాదేవీల విలువ పరంగా చూస్తే ఈ వాటా 92 శాతంగా నమోదైంది.