Recession: భూకంపాన్ని రేపుతున్న ట్రంప్‌.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు!

Recession: ట్రంప్ నిర్ణయంతో అమెరికా మార్కెట్‌లో ఎగసిన ఒక అల.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సముద్రాన్ని కొల్లగొట్టే సునామీగా మారే ప్రమాదం ఉంది.

Update: 2025-04-04 14:59 GMT

Recession: డేంజర్‌ అలెర్ట్..! ఓ పెను ముప్పు రానుంది..! భూకంపం కాదు.. సునామీ అంతకన్నా కాదు..కానీ వాటికి ఏ మాత్రం తీసిపోని మహా ఘోరం అది. ప్రాణనష్టం ఉండదు కానీ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే వినాశనం అది. ఇది ప్రకృతి వైపరిత్యాల వల్ల సంభవించే విషాదం కాదు.. ఓ మానవ మాత్రుడు విపరీతతనానికి పరాకాష్ట..! అవును...! మిస్టర్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచాన్ని మాంద్యం మంటల్లోకి నెడుతున్నారు..! ఓ పెద్ద తుపానుకు ముందు వీస్తున్న గాలిలా... ప్రపంచానికి ముందే కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌కి ఆజ్యం పోయడంతో నెక్ట్స్‌ ఏం జరగనుందోనన్న టెన్షన్‌ సర్వత్రా నెలకొంది. ఇంతకీ మాంద్యం మంటలను ప్రపంచం ముందే ఆర్పేస్తుందా? లేదా మానవ చరిత్రలో చూడని అతిపెద్ద ఆర్థిక విధ్వంసాన్ని మనం చూసే అవకాశం ఉందా?

మాంద్యం... ఈ పదం గతంలో పలుసార్లు ప్రపంచాన్ని షేక్‌ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే మాట బిగ్‌ డిబెట్‌కు కారణమౌతుంది. 2008 ఆర్థిక మాంద్యం కారణంగా నాడు లక్షల ఉద్యోగాలు పోయాయి.. అనేక కంపెనీలు తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. ధరలు పెరిగిపోయాయి...! ఆ దుస్థితి మళ్లీ ఇప్పుడు రానుందా అనే భయం ప్రజల్లో పెరిగిపోతోంది. మాంద్యం అంటే సాధారణంగా దేశం అభివృద్ధి చెందకుండా ఆగిపోవడమని అర్థం. ఆ సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూలిపోవడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం ఇది ఒక్క వ్యక్తిని, ఓ గ్రామాన్ని, ఓ దేశాన్ని కాదు... ప్రపంచాన్ని మొత్తం తాకే పరిస్థితి. మనం షాపుల్లో నిత్యవసరాలు కొనలేని పరిస్థితి ఉంటుంది. ఆఫీసుల్లో ఉద్యోగుల్ని తగ్గించేస్తారు. బ్యాంకుల్లో రుణాలు లభించటం కష్టమవుతుంది. ఇదంతా కలిసొచ్చే ప్రళయమే మాంద్యం. ఇప్పుడీ మాంద్యాన్ని నిద్రలేపారు ట్రంప్‌. రెసిప్రొకల్ టారిఫ్‌ల పేరుతో వివిధ దేశాలపై సరికొత్త సుంకాలు విధించారు.

ఇది కేవలం వ్యాపార యుద్ధం మాత్రమే కాదు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే ప్రక్రియకు పడిన తొలి అడుగు. అయితే ట్రంప్‌ చర్యలతో ముందుగా నష్టపోయేది ఆయన ప్రత్యర్థి దేశాలు కాదు.. ట్రంప్‌ నిర్వాకానికి ముందుగా బలయ్యేది ఆయన సొంత దేశ ప్రజలే. అవును..! అమెరికాలోనే ప్రజలే బాధపడే పరిస్థితులు రానున్నాయి. విదేశీ వస్తువులపై సుంకాలు పెరిగితే.. ఆ ఖర్చును భరించాల్సింది ప్రజలే కదా..! వస్తువుల ధరలు అమాంతం పెరిగితే ప్రజలు కూడా ఖర్చులు తగ్గిస్తారు. ఖర్చులు తగ్గితే మార్కెట్ నెమ్మదిస్తుంది. అప్పుడు కంపెనీలు నష్టాల బాట పడతాయి.. దీంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవాల్సిన దుస్థితి దాపరిస్తుంది. ఇలా ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం మొదలవుతుంది. ఇలా ముందుగా అమెరికా మాంద్యంలోకి వెళ్తుంది.. తర్వాత మిగిలిన దేశాలూ అదే బాట పడతాయి. అమెరికాలో ఒక్క నిబంధన మారినా.. దాని ప్రభావం ఆసియా మార్కెట్లపై పడుతుంది. అక్కడ ఉత్పత్తి మందగిస్తే. యూరోప్‌లో ఉపాధి తగ్గుతుంది. అక్కడ ఆదాయం పడిపోతే.. ఆఫ్రికాలోనూ మార్కెట్లు క్రాష్‌ అవుతాయి.

Tags:    

Similar News