Donald Trump Scam: ట్రంప్‌ బిగ్‌ స్కామ్.. టారిఫ్‌ వార్‌ వెనుక ఉన్న అసలు నిజమిదే!

Donald Trump Scam: టారిఫ్ నిర్ణయాల వెనుక భారీ ఆర్థిక కుట్ర ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, ట్రంప్‌పై ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఈ చర్యలు ఆయన పాలనపై మరింత ఒత్తిడిని పెంచేలా మారాయి.

Update: 2025-04-11 14:00 GMT
Donald Trump Scam

Donald Trump Scam: ట్రంప్‌ బిగ్‌ స్కామ్.. టారిఫ్‌ వార్‌ వెనుక ఉన్న అసలు నిజమిదే!

  • whatsapp icon

Donald Trump Scam: డొనాల్డ్ ట్రంప్‌పై ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్న ఈ వివాదం.. ఆయన టారిఫ్ నిర్ణయాల వెనక ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందేమో అన్న అనుమానాలతో మరింత ముదిరింది. అమెరికా అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా టారిఫ్ యుద్ధంపై ఆయన మలుపు మలుపైన నిర్ణయాలు భారీ చర్చకు దారితీశాయి.

అకస్మాత్తుగా ఆయన్ని విమర్శిస్తున్న డెమోక్రాట్లు.. ఈ టారిఫ్ మార్పుల వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపిస్తున్నారు. 1990లలో భారత స్టాక్ మార్కెట్‌ను కలిచివేసిన హర్షద్ మెహతా స్కాం గుర్తుందా? అప్పట్లో హవాలా ద్వారా డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టి, వాటి ధరలను పెంచి భారీ లాభాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ట్రంప్‌పై కూడా అలాంటి కుట్రే నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 2న ట్రంప్ అన్ని దేశాల నుంచే దిగుమతులపై టారిఫ్‌లు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో అమెరికా మార్కెట్లు అలాగే ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గ్లోబల్ రిసెషన్ భయాలు మొదలయ్యాయి. కానీ కొన్ని గంటలకే ట్రంప్ తన నిర్ణయాన్ని మారుస్తూ, చైనాను మినహాయించి మిగతా దేశాలపై టారిఫ్‌లను 90 రోజులకు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపాడు. అయితే చైనాపై టారిఫ్‌ను ఏకంగా 145 శాతం వరకు పెంచాడు.

ఈ నిర్ణయానికి కొద్దిసేపటి ముందే ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌ సోషల్‌లో రెండు పోస్టులు పెట్టాడు. ఒకదానిలో ఇప్పుడే షేర్లు కొనుగోలు చేయడానికి మంచి సమయం అంటూ సూచించాడు. మరొకదానిలో తన మీడియా కంపెనీ టిక్కర్ DJTని హైలైట్ చేశాడు. ఆ తర్వాత మార్కెట్‌లో 9 శాతం పైగా జంప్ కనిపించింది. ఈ పరిణామాలు చూసిన డెమోక్రాట్లు.. ఎవరో ముందుగానే సమాచారం తెలుసుకుని మార్కెట్‌ను ఉపయోగించుకుని భారీ లాభాలు సాధించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ట్రంప్ శిబిరం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. కానీ, ఈ ఘటన ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. మార్కెట్ హెచ్చుతగ్గులు, బంగారం ధరల ఊగిసలాట, డాలర్ మారకపు విలువలో హెచ్చుతగ్గులు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇక ఒకవేళ ఈ ఆరోపణలపై విచారణ జరుగితే ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News