Credit Card Charges: క్రెడిట్ కార్డు పేరుతో బ్యాంకులు ఎలాంటి చార్జీలు వాయిస్తాయే తెలుసా?

Credit Card Charges: క్రెడిట్ కార్డు పేరుతో బ్యాంకులు ఎలాంటి చార్జీలు వాయిస్తాయే తెలుసా?
Credit Card Charges: క్రెడిట్ కార్డు... చాలామందికి చేతిలో డబ్బుల్లేనప్పుడు, బ్యాంక్ ఎకౌంట్ ఖాళీగా ఉన్నప్పుడు గొప్పగా కనిపించే అవకాశం. కానీ ఆ గొప్ప అవకాశం వెనుకే కంటికి కనిపించని కొన్ని అదనపు ఖర్చులు కూడా వస్తాయనే విషయం చాలామంది గ్రహించరు. కొంతమంది అత్యవసరంలో మాత్రమే క్రెడిట్ కార్డు వాడుతుంటారు. ఇంకొంతమంది మాత్రం క్రెడిట్ కార్డులపై చార్జీలు ఏ విధంగా ఉంటాయో తెలియక విచ్చలవిడిగా వాడేస్తుంటారు.
అయితే, మొదటి రకం వారు కొంత జాగ్రత్తపరులు కావడం వల్ల వారికి క్రెడిట్ కార్డు లతో వచ్చే అదనపు ఖర్చుల రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డులు అవగాహన లేకుండా ఉపయోగించే వారికి మాత్రం జేబుకు చిల్లు పడటం ఖాయం. ఇంతకీ క్రెడిట్ కార్డు వినియోగంతో వచ్చే ఆ అదనపు చార్జీలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వార్షిక ఛార్జీలు ( Credit cards annual charges)
క్రెడిట్ కార్డు సేవలు అందించే బ్యాంకులు అందుకు బదులుగా యాన్వల్ చార్జెస్ విధిస్తుంటాయి. క్రెడిట్ కార్డు రకం, క్రెడిట్ లిమిట్ ను బట్టి బ్యాంకులు కనిష్టంగా రూ. 500 నుండి 1000 - 2000 వరకు వసూలు చేస్తుంటాయి. ఇది మీరు క్రెడిట్ కార్డు వాడినా, వాడకపోయినా కట్టాల్సిందే.
లావాదేవీలపై ఛార్జీలు ( Transaction charges )
క్రెడిట్ కార్డు ఉపయోగించినందుకు బ్యాంక్స్ ఆయా లావాదేవీలపై ట్రాన్సాక్షన్ ఛార్జీలు విధిస్తాయి. ఇది మీరు కార్డు వాడే తీరును బట్టి పెరుగుతుంది.
ఆలస్య రుసుము ( Late payment charges )
క్రెడిట్ కార్డు పై డ్యూ డేట్ లోగా బిల్లు చెల్లించాలి. లేదంటే మీ జేబుకు పెద్ద చిల్లు ఖాయం. లేట్ పేమెంట్ ఛార్జీల పేరుతో బ్యాంకులు మీ నుండి భారీగానే దండుకుంటాయి.
వడ్డీ మోత ( Interest charges )
క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కడితే ఇబ్బంది లేదు. కానీ డ్యూ డేట్ దాటిపోయిందంటే, లేట్ పేమెంట్ తో పాటు ఔట్స్టాండింగ్ అమౌంట్ పై వడ్డీ వడ్డించడం మొదలు అవుతుంది. ఇలాంటి సందర్భంలోనే క్రెడిట్ కార్డు హోల్డర్స్ వల్ల బ్యాంకులు లాభపడుతుంటాయి.
క్యాష్ అడ్వాన్స్ ఫీజు
బ్యాంకులు క్రెడిట్ కార్డు లిమిట్ లో 20% నుండి 40% వరకు క్యాష్ విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. కానీ ఈ క్యాష్ విత్ డ్రాలపై 2.5% నుండి 3% వరకు చార్జెస్ విధిస్తుంటాయి.
ఓవర్ లిమిట్ ఫీజు
మీకు బ్యాంక్ ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువ మొత్తంలో బ్యాంకుకు బాకీ ఉన్నట్లయితే, అప్పుడు బ్యాంక్స్ మీకు ఓవర్ లిమిట్ ఫీజు ఛార్జ్ చేస్తాయి.
క్రెడిట్ లిమిట్ దాటిపోవడం ఎలా సాధ్యం అని మీకు ఒక డౌట్ రావచ్చునేమో. ఎందుకంటే, ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువ స్వయిప్ చేసేందుకు బ్యాంక్స్ అనుమతించవు కనుక ఆ డౌట్ రావడం సహజమే.
అయితే, ఇచ్చిన క్రెడిట్ లిమిట్ మొత్తాన్ని స్వయిప్ చేసి, ఆ బిల్లు సకాలంలో చెల్లించకపోతే, అప్పుడు బ్యాంక్స్ విధించే లేట్ పేమెంట్ ఛార్జీలు, వడ్డీ లాంటివి కలిపి క్రెడిట్ లిమిట్ దాటిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడే బ్యాంక్స్ ఓవర్ లిమిట్ ఫీజు వసూలు చేస్తుంటాయి.