Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. తర్వాత బాధపడొద్దు..!
Term Insurance:కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని సందర్భంలో చనిపోతే ఆ కుటుంబ బాధలు వర్ణణాతీతం.
Term Insurance: కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని సందర్భంలో చనిపోతే ఆ కుటుంబ బాధలు వర్ణణాతీతం. ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉంటారు. అప్పటి వరకు బాగా బతికిన కుటుంబం ఒక్కసారిగా దివాళాతీస్తుంది. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే కుటుంబ పెద్ద దిక్కు కచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీనివల్ల కనీసం కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించినట్లు అవుతుంది. ప్రస్తుతం తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కల్పించే అనేక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని తీసుకునే ముందు కొన్ని విషయాలు పరిగణలోనికి తీసుకోవాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎంత మొత్తానికి తీసుకోవాలని చాలామందికి అనుమానం రావొచ్చు. మీ ప్రస్తుత ఆదాయం, భవిష్యత్‌లో మీరు సంపాదించబోయే మొత్తం ఆధారంగా దీన్ని నిర్ణయించుకోవాలి. కనీసం 200 నెలల వేతనానికి సమానమైన మొత్తానికి తక్కువ కాకుండా దీని విలువ ఉండాలి. అలాగే పిల్లల చదువులు, పెళ్లి, ఇల్లు, కారు రుణాలు ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వీటిని కూడా పరిగణలోనికి తీసుకొని అమౌంట్ నిర్ణయించుకోవాలి.
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కంపెనీ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దాని క్లెయిమ్‌ల పరిస్థితి గురించి ఆరా తీయాలి. ఇందుకోసం ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్‌ను చూడాలి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ప్రీమియం చెల్లిస్తే తీరా క్లెయిమ్ రాకుంటే పాలసీ తీసుకొని వృథా అవుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే పాలసీ తీసుకునే సమయంలో కొన్ని రకాల రైడర్స్‌ను తీసుకోవాలి. క్రిటికల్ ఇల్‌నెస్, డిజేబిలిటీ కవర్‌లాంటి రైడర్లను తీసుకోవాలి. వీటివల్ల ప్రీమియం కొంత పెరుగవచ్చు. కానీ దీనివల్ల మీకు వచ్చే అమౌంట్ కూడా పెరుగుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పాలి. ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చెబితే పాలసీ రిజెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆహార అలవాట్లు, ఆరోగ్య, ఆర్థిక వివరాల్లో ఎలాంటి తప్పులూ ఉండకూడదు. బీమా ఒప్పందంలో ఇరు పక్షాలూ పూర్తి పారదర్శకంగా ఉండాలి. నిజాలను దాచిపెడితే క్లెయిము సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, బీమా సంస్థ అడిగిన సమాచారాన్ని మొత్తం తెలియజేయాలి. అవసరమై తే ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకూ సిద్ధంగా ఉండాలి.