5G Auction: నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న 5G స్పెక్ట్రమ్ వేలం..
5G Auction: భారత్‌లో 5జీ సేవలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
5G Auction: భారత్‌లో 5జీ సేవలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపులు పూర్తి చేసుకుని ఏడాది చివరి నాటికి సేవలు అందుబాటులోకి రానున్నట్టు టెలికాం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. రెండ్రోజుల పాటు 5జీ స్పెక్ట్రమ్ కోసం టెలికాం శాఖ వేలం నిర్వహించింది. తొలి రోజు వేలంలో జియో, ఎయిర్‌టెల్, ఐడియా-వోడఫోన్, అదానీ గ్రూప్స్ పోటీపడ్డాయి. వేలంలో లక్ష 45వేల కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఇది 2015లో 4జీ వేలం కంటే అధికంగా బిడ్లు వచ్చినట్టు టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అత్యంత ఖరీదైన 700 మెగా హెడ్స్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు 2016, 2021లో వేలం నిర్వమించినా ఎవరూ ముందుకు రాలేదు. ఈసారి మాత్రం 700 మెగా హెడ్జ్ బ్యాండ్‌కు కూడా బిడ్లు రావడం విశేషం. తొలిరోజు వేలంలో 700 మెగా హెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు 39వేల 270 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చాయి.
తొలి రోజు నాలుగు రౌండ్లలో బిడ్లు దాఖలయ్యాయి. 3వేల 300 మెగాహెడ్జ్, 26 గిగా హెడ్జ్ బ్యాండ్ కోసం కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. రెండో రోజు ఐదో రౌండ్ బిడ్డింగ్‌తో వేలం మొదలయింది. మొత్తం స్పెక్ట్రమ్ విలువ 4లక్షల 30 వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), 3300 MHz, 26 GHz, ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో వేలం జరుగుతున్నది. వేలం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. అయితే స్పెక్ట్రమ్ పూర్తిగా అమ్ముడుపోయేవరకు వేలంను టెలికాంశాఖ నిర్వహించనున్నది. కొన్ని రోజుల పాటు వేలం జరిగే అవకాశాలు ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వేలంలో ప్రధానంగా జియోనే ఎక్కువగా పోటీ పడుతోంది. ముందుగానే జియో కంపెనీ 14 వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేసింది.
త్వరలోనే దేశంలో 5జీ టెలికం సేవలు ప్రారంభం కానున్నాయి. వినియోగదారులకు మరింత వేగవంతమైన బ్రౌజింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంత వేగం అంటే 4జీతో పోలిస్తే 5జీ వేగం 100 రెట్లు ఎక్కువ. అయితే 5జీ స్పెక్ట్రమ్ కోసం టెలికం సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రభావం 5జీ సేవల ధరలపై చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్ట్రమ్ వేలం ముగిసిన తర్వాతే తుది వ్యయాలపై అంచనాకు రాగలమని ఎయిర్ టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖాన్ చెప్పారు. 5జీ సేవలు ఇప్పటికే ప్రారంభమైన చోట ధరలు 4జీ కంటే ఎక్కువ లేవన్నారు. కానీ ప్రస్తుతం 4జీ కోసం చెల్లిస్తున్న దానికంటే 5జీ సేవల కోసం 10 నుంచి 12 శాతం వరకు అదనంగా చెల్లించుకోవాల్సి నిపుణులు విశ్లేషిస్తున్నారు.