Unlock 4.0: మరిన్ని ప్రత్యేక రైళ్లు రానున్నాయ్!
Unlock 4.0 South Central Railway planning: లాక్ డౌన్ నుంచి ఒక్కో బంధనం వీడుతోంది...మెట్రోకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో, దాని బాటలోనే దక్షిణమధ్య రైల్వే యోచిస్తోంది.
South Central Railway | లాక్ డౌన్ నుంచి ఒక్కో బంధనం వీడుతోంది... ప్రత్యేకంగా ప్రయాణ సాధనాలకు సంబంధించి ఇప్పటికే మరిన్ని బస్సులను తిప్పేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెట్రోకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో, దాని బాటలోనే దక్షిణమధ్య రైల్వే యోచిస్తోంది. ఇప్పటికే నడుపుతున్న కొన్ని ప్రత్యేక రూట్లలో అదనపు రైళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, కొత్త లైన్లలో సైతం అన్ లాక్ అనంతరం పున:ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సబంధించి రైల్వే అధికారులు, ప్రయాణికులు అవలంభించాల్సిన విధి, విధానాలపై చర్చిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ మేరకు త్వరలో మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేపట్టింది. అన్‌లాక్ 4.0 అమలు దృష్ట్యా ప్రత్యేక రైళ్లపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రైల్వేబోర్డు జోన్‌లకే అప్పగించింది. వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని రైళ్లను నడపాలని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ప్రతిరోజు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా రద్దీ ఉన్న మార్గాల్లో మరో 15 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా రెగ్యులర్ రైళ్ల స్థానంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ బోగీలతోపాటు సాధారణ బోగీల్లోనూ ముందుగా బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది.
లాక్‌డౌన్ నిబంధనలను సడలించి తొలివిడత సికింద్రాబాద్–న్యూఢిల్లీ, బెంగళూర్–న్యూఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్ నుంచి ముంబై, విశాఖ, హౌరా, దానాపూర్, విజయవాడ, తిరుపతి రూట్లలో కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో వివిధ ప్రాంతాల మధ్య చిక్కుకుపోయిన ప్రయాణికుల రాకపోకలతో అనూహ్యమైన రద్దీ నెలకొంది. ఆ తరువాత కొద్ది రోజులపాటు కరోనా ఉధృతి బాగా తీవ్రం కావడంతో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. తిరిగి కొంతకాలంగా వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 25వేల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని రైళ్లలో 100కు పైగా వెయిటింగ్ లిస్టు నమోదుకావడం గమనార్హం.
ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాలివే...
కరోనాతో సహజీవనం తప్పనిసరిగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రయాణికులు భయాందోళనలను పక్కన పెట్టి వివిధ మార్గాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు.
- ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఒక రైలు మాత్రమే ఉంది. కానీ, ప్రయాణికుల డిమాండ్ బాగా ఉండటంతో ఈ రూట్‌లో మరో సర్వీసును ప్రారంభించనున్నారు.
- హైదరాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది.
- ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పట్నాకు, హౌరాకు ఒక్కో రైలు నడుస్తోంది. ఇపుడున్న రైళ్లలో 100కు పైనే వెయిటింగ్ లిస్టు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రూట్లలోనూ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. - సికింద్రాబాద్–చెన్నై మధ్య రైళ్లు లేవు. ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడపడం కోసం దక్షిణమధ్య రైల్వే, దక్షిణ రైల్వేల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
- కాచిగూడ నుంచి బెంగళూరుకు మరో సర్వీస్ నడపనున్నారు. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్ నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
- ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు నడిచే రైలు సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తోంది.
- ప్రస్తుతం నడుస్తున్న 22 ప్రత్యేక రైళ్లతోపాటు మరో 15 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎంఎంటీఎస్‌పై పునరాలోచన...
ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా నడపాలని అధికారులు ఆలోచిస్తున్నారు. డిమాండ్ ఉన్న ఒకటి, రెండు రూట్లలో ఎంఎంటీఎస్ నడపాలని భావిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజు 121 సర్వీసులు నడుస్తాయి. రోజుకు 1.5 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనే ఆలోచన ఉంది.