Top-6 News of the Day: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-08-02 12:41 GMT

Top-6 News of the Day: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day (03/08/2024)

1. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన భట్టి విక్రమార్క


 జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ అసెంబ్లీలో విడుదల చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. గతంలో రెండుసార్లు గ్రూప్ -1 పరీక్ష రెండుసార్లు రద్దైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ లో కేవలం ఆయా శాఖల్లోని ఖాళీలున్న పోస్టుల సంఖ్య, ఆయా పరీక్షల తేదీలుంటాయని ఆయన వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.

2. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను బరిలోకి దింపిన వైఎస్ఆర్సీపీ


 విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దింపింది వైఎస్ఆర్ సీపీ. శుక్రవారం విశాఖపట్టణానికి చెందిన ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో , నాయకులతో ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ సీపీకి మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కళా వెంకట్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ నుంచి వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. దీంతో వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు మేరకు మండలి చెర్మన్ ఆయనపై అనర్హత వేటు పడింది.దీంతో విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

3. దిల్లీ ఐఎఎస్ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు మృతిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం


 దిల్లీ ఐఎఎస్ కోచింగ్ సెంటర్ లో ఆకస్మాత్తుగా వచ్చిన వరదలతో ముగ్గురు మరణించిన ఘటనపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఒక అధికారిని నామినేట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ను కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జూలై 27న భారీ వర్షాలతో సెంట్రల్ దిల్లీ కోచింగ్ హబ్ లోని ఓల్డ్ రాజిందర్ నగర్ రావుస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ భవనం బేస్ మెంట్ వరదల్లో మునిగి తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు.

4. ఇండియన్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సర్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగాలు


 ఇండియన్ క్రికెట్ జట్టు సభ్యులు మహమ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు. మరో వైపు ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించారు. హైద్రాబాద్ బేగరికంచలోని స్కిల్ యూనివర్శిటీకి సమీపంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయమై బీసీసీఐ తో చర్చలు జరిపినట్టుగా ఆయన గుర్తు చేశారు. క్రీడల కోసం బడ్జెట్ లో రూ. 321 కోట్లు కేటాయించినట్టుగా తెలిపారు.

5. అమరావతిలో భవనాలను పరిశీలించిన ఐఐటీ బృందం


 అమరావతిలోని నిర్మించిన భవనాల నాణ్యతను ఐఐటీ నిపుణులు పరిశీలించారు. రెండు రోజుల పాటు ఈ టీమ్ భవనాల నాణ్యతను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలతో పాటు ఇతర భవనాల నాణ్యత, పటిష్టతపై నివేదికను ఇస్తారు. గత కొంతకాలంగా ఈ భవనాల నిర్వహణను పట్టించుకోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతే రాజధాని అంటూ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి రూ. 15 వేల కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించింది. అమరావతిలో నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతం పూర్తైన కొన్ని భవనాల నాణ్యతను, పటిష్టతను తెలుసుకొనేందుకు ఐఐటీ నిపుణుల బృందాన్ని రప్పించారు.

6. అసెంబ్లీలో దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన


 దానం నాగేందర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు.సభ నుంచి వాకౌట్ చేశారు. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్లో అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలుంటే రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. హైద్రాబాద్ అభివృద్దిపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమపట్ల దానం పరుష పదజాలం ఉపయోగించారని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. నిరసనకు దిగారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు. అయితే తాను సభలో ఎలా ఉంటానో అందరికీ తెలుసునని నాగేందర్ చెప్పారు. తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టారని...తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాను పరుష పదజాలం ఉపయోగించలేదన్నారు. క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ మరోసారి కోరారు. తాను అదే విషయం చెప్పానని నాగేందర్ తెలిపారు. దానం వ్యాఖ్యల్లో అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలుంటే రికార్డులనుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు.

Tags:    

Similar News