Ugadi 2025: ఉగాది పంచాంగం.. మిథునరాశివారికి ఈ సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది..!
Ugadi 2025: ఉగాది పంచాంగం.. మిథునరాశివారికి ఈ సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది..!
ఆదాయం- 14
వ్యయం - 2
రాజపూజ్యత- 4
అవమానం- 3
Ugadi 2025 Gemini Horoscope: ఈ రాశివారికి ఈ సంవత్సరంలో గురుబలం అంతంత మాత్రంగానే ఉంది. అన్ని విధాలా జాగ్రత్తగా మెలగాల్సిన కాలమిది.ప్రతీ ప్రయత్నానికీ పట్టుదలను జోడించాల్సి ఉంటుంది. పనులు కాస్త ఆలస్యమైనా విజయం లభిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితమే దక్కుతుంది. నూతన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. సరికొత్త ఆలోచనలు, సంయమనంతో కార్యాలను సాధించుకుంటారు. బద్ధకించడం, పనులను వాయిదా వేయడం వల్ల ఏ ప్రయోజనమూ సిద్ధించదు. అపార్థాలు, మనస్పర్థలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా దాయాదులు, సోదరుల విషయాల్లో మితిమీరిన జోక్యం మంచిది కాదు. సాహసోపేతమైన స్వీయ నిర్ణయాలు ఉపకరిస్తాయి.
కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగానే సాగుతాయి. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలూ తొలగిపోతాయి. బంధు మిత్రుల సహకారంతో వివాహాది శుభకార్యాలను విజయవంతంగా నిర్వహిస్తారు. అదే సమయంలో ఆత్మీయులతో విరోధాలు పెరిగి మానసిక స్థిరత్వం దూరమయ్యే సూచన ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్థిరాస్తులు మరియు వస్తు, వాహన ఆభరణాల కొనుగోలు యత్నాలు కొద్దిమేర అనుకూలిస్తాయి. తండ్రితో గానీ, తండ్రి తరపు బంధువులతో గానీ విరోధం ఏర్పడే సూచన ఉంది. యుక్తితో మెలగడం అవసరం. ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
వృత్తి, ఉద్యోగాల్లోని వారికి అనుకూలంగా ఉంది. చేతివృత్తులు నిర్వహించేవారు లాభాలను పొందుతారు. వృత్తి సంబంధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి స్థిరత్వం ఏర్పడుతుంది. పరిచయాలు పెరిగి ఆర్థికంగా బలపడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఫలితాలు ఆశించిన విధంగానే ఉంటాయి. బదిలీలు, పదోన్నతుల ద్వారా లబ్ది చేకూరుతుంది. బాధ్యతల నిర్వహణలో మానసిక అశాంతి, ఒత్తిడి ఉన్నా, ఉన్నతాధికారుల ప్రశంసలు ఉత్తేజాన్నిస్తాయి. ప్రైవేటు రంగంలోని వారికి ప్రమోషన్లు ఆర్థిక వృద్ధితో కూడుకుని ఉంటాయి. ఉద్యోగ స్థిరత్వంపై అనుకోని ఆందోళనలు నెలకొంటాయి. నిరుద్యోగులకు అతి కష్టమ్మీద అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించక పోవచ్చు.
వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలే ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి అంత అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారం కన్నా సొంత వ్యాపారమే అనుకూలిస్తుంది. తప్పనిసరై భాగస్వామ్య వ్యవహారాల్లో తలదూర్చాల్సి వస్తే, ప్రతీ విషయంలో స్వీయ పర్యవేక్షణ అవసరం.
రాజకీయ రంగంలోని వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఊరిస్తోన్న పదవి దక్కే అవకాశం ఉంది. జనాదరణనూ పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు, షేర్లలో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి వ్యవహరించాలి. తెలివితేటలను చూపకపోతే బాగా నష్టపోయే సూచన ఉంది.
విద్యార్థులకు శ్రమ అధికంగాను, ఫలితం తక్కువగానూ ఉంటుంది. ఉత్తీర్ణత కోసం విశేషంగా శ్రమించాల్సి వుంటుంది. సోమరితనం, పనులు వాయిదా వేయడం పనికిరాదు. పరీక్షల్లో ర్యాంకుల కోసం పోటీ గట్టిగా ఉంటుంది.
మిథున రాశివారు ఈసంవత్సరం దుర్గాస్తోత్రం, నవగ్రహ స్తోత్రాలను పారాయణ చేయడం మంచిది. శివుడికి రుద్రాభిషేకం, విష్ణు సంబంధిత ఆలయ సందర్శనం కూడా మేలు చేస్తాయి.