Ugadi 2025 Pisces Horoscope: మీనరాశివారికి స్వర్ణయుగం.. వీరి కోరికలు తీరే సమయం..

Ugadi 2025 Pisces Horoscope: ప్రధానమైన గ్రహాల అనుకూలత వల్ల.. ప్రయత్నాల్లో మంచి ఫలితాలనే పొందుతారు. కార్యసాధనలో తోడుగా నిలిచేవారూ ఎక్కువగానే ఉంటారు.

Update: 2025-03-30 02:15 GMT

Ugadi 2025 Pisces Horoscope: మీనరాశివారికి స్వర్ణయుగం.. వీరి కోరికలు తీరే సమయం..

ఆదాయం-5

వ్యయం- 5

రాజపూజ్యత- 3

అవమానం- 1

Ugadi 2025 Pisces Horoscope: ప్రధానమైన గ్రహాల అనుకూలత వల్ల.. ప్రయత్నాల్లో మంచి ఫలితాలనే పొందుతారు. కార్యసాధనలో తోడుగా నిలిచేవారూ ఎక్కువగానే ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉన్నా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్తేజాన్ని నింపుతుంటాయి. సమస్యలను దీటుగా ఎదుర్కొనే సహనం అలవాటవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో.. దళారుల కారణంగా మోసపోయే సూచన ఉంది. నిరుద్యోగులు, అవివాహితులకు ఈ సంవత్సరం శుభ ఫలితాలు దక్కుతాయి. సంతానం పురోగతి ఆనందాన్ని పెంచుతుంది. అనూహ్యమైన ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. కార్యాల్లో విఘ్నాలు తలెత్తినా, సమయస్ఫూర్తితో దాటేస్తారు. నూతన విషయాలను తెలుసుకుంటారు. కొత్త పరిచయాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. కార్యసాధనలో వాయిదా పద్ధతి మంచిది కాదు.

గడచిన కాలం కంటే.. ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను సామరస్యంగా నిర్వహిస్తే, శాంతి సౌభాగ్యాలు పెరుగుతాయి. వస్తు, వాహనాలను కొంటారు. సామాజిక గౌరవం వృద్ధి చెందుతుంది. పాత అప్పులను తిరిగి చెల్లించే పరిస్థితులూ గోచరిస్తున్నాయి. వివాహాది శుభ కార్యాలకు బంధుమిత్రులు సహకరిస్తారు. ఈ రాశివారు ఏపనికైనా, ఇతరులపై ఆధారపడకుండా, స్వయంకృషిని నమ్ముకోవడం మేలు. అవసరానికి మించిన అప్పులు చేయకండి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. సాధ్యమైనంత మేర, వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

వృత్తి ఉద్యోగాల్లోని వారికి సాధారణ ఫలితాలుంటాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారికి ఆశాజనంగా ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. పైఅధికారులు, పెద్దల ప్రశంసలను పొందుతారు. ప్రభుత్వ రంగంలోని వారికి ఒడుదుడుకులుంటాయి. ప్రమోషన్లు బదిలీల వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ఉద్యోగ స్థిరత్వంలోనూ ఆలస్యముంటుంది.

వ్యాపారాభివృద్ధి కోసం చేసే రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేయాలి. వీలైతే ఈ సంవత్సరం వ్యాపార ఆరంభ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్, స్పెక్యులేషన్స్ వ్యవహారాలు మధ్యమ ఫలితాలనే సూచిస్తున్నాయి.

రాజకీయ రంగంలోని వారికి వృద్ధి క్షయాలు సమంగానే ఉంటాయి. ఆశించిన పదవులు ఊరించి ఉస్సురనిపిస్తాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, రహస్యాలు బట్టబయలు కాకుండా అతి జాగ్రత్తగా నడచుకోవాలి

విద్యార్థులకు సాధారణ ఫలితాలే ఉంటాయి. బాగా శ్రమిస్తేనే గాని లక్ష్యాన్ని చేరుకోలేరు. ఆశించిన ర్యాలకులను సాధించకున్నా, ఫలితాలు కాస్తంత మెరుగ్గానే ఉంటాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కొద్దిపాటి ఆలస్యమైనా, సత్ఫలితాలు లభిస్తాయి.

మీనరాశి వారు ఈ సంవత్సరం, నిత్యం శివకవచము, అర్ధనారీశ్వర స్తవమును పారాయణ చేయడం మేలు. దుర్గారాధన, వీలున్నప్పుడల్లా దుర్గా సప్తశతి పారాయణం శుభ ఫలితాలనిస్తుంది. ఏలినాటి శని దోష నివారణ కోసం శనికి నువ్వుల నూనెతో అభిషేకం, రాహు గ్రహ శాంతికి మినుములు, నూనె వంటి దానాలు మంచిది.

Tags:    

Similar News