ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలపై ప్రతిపక్షాల విమర్శలకు వైసీపీ సర్కార్ చెక్‌పెట్టబోతుందా ? అందుకు ముహూర్తం ఖరారు చేసిందా ? కూలిన, ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించాలన్న జగన్ నిర్ణయంపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్ ?
ఏపీలో విగ్రహ విధ్వంసం ఘటనలు, ఆలయాలపై దాడులపై వైసీపీ సర్కార్‌ను కార్నర్ చేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయ్. ప్రభుత్వమే మతమార్పిడులను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను పునర్ నిర్మించాలని నిర్ణచించారు. 9 ఆలయాలకు సంబంధించి నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.
దుర్గగుడి అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం జగన్ ఆ తర్వాత అమ్మవారవని దర్శించుకోనున్నారు. మొదట శనీశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో రెండు వేర్వేరు శిలా ఫలకాలు ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడ భూమి పూజ చేసిన తర్వాత కొండపైకి చేరుకుంటున్నారు. ఇంతేకాదు 13 జిల్లాల పరిధిలో వివిధ రకాల ఘటనల కారణంగా నష్టం జరిగిన 40 ఆలయాల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటామని వైసీపీ సర్కార్ స్పష్టం చేస్తోంది. రామతీర్థం ఘటన తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని మరింత టార్గెట్ చేస్తున్నాయ్ విపక్షాలు. ఇలాంటి విమర్శలకు ఒకేసారి చెక్ పెట్టాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.