తాడేపల్లికి చేరిన ఐపాక్ సర్వే నివేదిక.. వైసీపీ క్యాంప్‌లో జరుగుతున్న చర్చేంటి?
*వచ్చే ఎన్నికల నాటికి గ్రాఫ్ పెంచుకునే పనిలో ఎమ్మెల్యేలు!
YS Jagan: వచ్చేసారి కూడా అధికారమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే, వ్యూహకర్తల పనిని స్పీడప్ చేస్తున్నారా? ఈపాటికే తనకు అందిన ఫస్ట్ ఫేజ్ సర్వే రిపోర్ట్స్‌ను స్టడీ చేస్తున్న అధినేత ఆ నివేదిక ఆధారంగా ఎవరికి చెక్ పెట్టబోతున్నారు.? గతంలోనే తాను చెప్పిన గ్రాఫ్ ఈసారి ఏమాత్రం తగ్గినా ఊరుకునేది లేదని సిట్టింగ్‌లకు అందుకే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారా? వైసీపీ క్యాంప్‌లో ఒక రకమైన అలజడి రేగుతుండగా, అధినేత ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు? ఎవరి మీద కరుణ చూపించబోతున్నారు?
వచ్చే ఎన్నికల్లో భారీ గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారట. టార్గెట్ 175 సెట్ చేసిన వైసీపీ బాస్ ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారట. మరి ఆ టార్గెట్ రీచ్ అవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు అది సాధ్యం కాదని అధినేతకు తెలియందేమీ కాకున్నా దాన్ని సుసాధ్యం చేసి చూపించాలన్న పట్టుదలతో ఉన్నారని వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులకు జగన్ కొన్ని విలువైన సూచనలు చెప్పి ఎన్నికల సమరంగానికి సిద్ధం చేస్తున్నారట.
ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సర్వేలు నిర్వహిస్తున్నారట. అందులో భాగంగానే అటు సిట్టింగ్‌లు, ఇటు గతంలో ఓడిపోయిన వారితో కలిసి సమీక్షిస్తున్నారట. ఆ సమీక్షలో తేలిన విషయం ఏమిటంటే 2024 ఎన్నికల్లో 50 మందికి పైగా బెర్త్ దక్కడం కష్టమేనట. ఇదే వైసీపీ కాంపౌండ్‌లో రీసౌండ్ ఇస్తోంది. ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందటిసారి ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఇలా ఎవరైనా... తనకు ఎంత కావలసిన వారైనా సీటు విషయంలో చాన్స్ తీసుకునే పరిస్థితే లేదని జగన్ క్లారిటీ ఇస్తున్నారట. సర్వే నివేదికలపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉందని, జాగ్రత్తగా పనిచేసుకోండని హెచ్చరిస్తున్నారట. దీంతో రాష్ట్రంలో రెండేళ్లకు ముందే ఎన్నికల హీట్ ప్రారంభమైందన్న చర్చల మధ్య వరుస పర్యటనలు, సమీక్షలతో వైసీపీ బాస్ ఆ వేడిని మరింత పెంచుతున్నారన్న చర్చ జరుగుతోంది.
గతంలో ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ చేసిన వ్యాఖ్యలు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పని తీరుపై చర్చకు తెరలేపిన జగన్ 40 నుంచి 45 శాతమే ఎమ్మెల్యేల గ్రాఫ్ సరిగ్గా ఉందని మిగిలిన వారు సరిదిద్దుకోవాలని సున్నితంగా మందలించారట. వైసీపీతో పాటు, తన ఇమేజే కాకుండా సొంతంగా ఇమేజ్‌ను ఎలా పెంచుకోవాలో ఆలోచించాలన్న అధినేత, సొంత పార్టీలో గూడుకట్టుకున్న విబేధాలు, ఎమ్మెల్యేల వ్యతిరేకవర్గం అంతా ఒక్కటై పోవాలని గట్టిగానే హెచ్చరిస్తున్నారట. మరి, ఈ పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ వస్తుంది. ఎవరికి రాదు అనే విషయాలపై భారీ అంచనాలు వేసుకుంటున్నారు వైసీపీ నేతలు. ఏ నలుగురు నాయకులు కలిసిన ఇదే హాట్‌టాపిక్‌గా మారడం విశేషం.
గ్రాఫ్ పడిపోతే సీట్ ఇచ్చేది లేదని అధినేత జగన్ కుండబద్దలు కొట్టడంతో ఎవరి స్థానానికి ఎసరు పడుతుందోనన్న బెంగ పలువురు ఎమ్మెల్యేలకు పట్టుకుందట. నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు రాదంటూ, కొత్త వారికి ఛాన్స్ అంటూ ఆశావహుల వర్గీయులు ఇంటింటికీ తిరిగి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. అధినేత దృష్టిలో ఎవరు పాస్.. ఎవరు ఫెయిల్ అన్నది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు స్పష్టత రావడంతో వచ్చే ఎన్నికల నాటికి తమ గ్రాఫ్ పెంచుకునే పనిలో పడ్డారట కొందరు ఎమ్మెల్యేలు. మరికొందరైతే, తమ గ్రాఫ్ ఎలా పెంచుకోవాలా అన్న ప్రణాళికల్లో మునిగి తేలుతున్నారట. అయితే అధినేత జగన్, ఈనెల నుంచి 9 నెలలు పాటు జనంలో తిరుగుతూ, గ్రాఫ్ పెంచుకునే వారికి తన సర్వే ఆధారంగా మాత్రమే టికెట్ ఇస్తానని చెప్పనుండటంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లోలోపల మథనపడుతున్నట్టు తెలుస్తోంది.
ఏమైనా, వచ్చే ఎన్నికల నాటికి అధినేత జగన్ మదిలో ఉన్న ప్రణాళికలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వారిని కలవరపెడుతున్నాయనేది క్లియర్. మరి ఎన్నికల నాటికి ఏ పరిస్థితులు ఉంటాయి. కొత్తగా ఎవరెవరు తెరపైకి వస్తారు. ఎవరు ఎర్త్ పెడతారు. ఎవరిని బెర్త్ ఎక్కిస్తారన్నది తెలియాలంటే వెయిట్ అడ్ సీ.