చిత్తూరు జిల్లాలో యువకుడి అదృశ్యం కలకలం
* కనిపించకుడా పోయిన మార్జేపల్లెకు చెందిన గణేష్ * దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ గణేష్ లేఖ * తమ్ముడికి కొడుకుగా పుడతానని లెటర్
చిత్తూరు జిల్లాలో యువకుడి అదృశ్యం కలకలం రేపుతోంది. గంగవరం మండలం మార్జేపల్లెకు చెందిన గణేష్ తాను దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అయితే తల్లిదండ్రులు, బంధువులు సమీప ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.
శివశంకర్, పద్మజ దంపతుల మొదటి సంతానం గణేష్. గంగవరం సమీపంలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో చురుగ్గా ఉండేవాడు. అంతేకాదు ఇతర సాంఘిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఈ నెల 21న రాత్రి తన నోట్‌బుక్‌లో రెండు పేజీల లేఖను రాసి అదృశ్యమయ్యాడు గణేష్. బైక్, సెల్‌ఫోన్, పుస్తకాల బ్యాగ్‌ను కూడా తనతో పాటు తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి అతడు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో తెలియక నిద్రహారాలు మాని తల్లిదండ్రులు గణేష్ కోసం వెతుకుతున్నారు.
మరోవైపు గణేష్ తాను ఇంటి నుంచి వెళ్తూ రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుట్టాలని ఉంది. మరో జన్మలోనైనా మీరు చెప్పినట్టు నడుచుకునేట్టు ఆ దేవుడిని వరం అడుగుతా. అమ్మా.
నేను అసలు పుట్టనే లేదనుకో. తమ్ముడు జాగ్రత్త. వాడిలోనే నున్న చూసుకోండి. నాన్నా ఒకవేళ నేను గుర్తుకొస్తే, నన్ను క్షమించు. తమ్ముడికి నేనే కొడుకుగా పుడతా. మళ్లీ నువ్వే నన్ను పెంచి పెద్ద చేయాలి. తమ్ముడూ అమ్మానాన్నకు ఇక అన్నీ నువ్వేనంటూ రెండు పేజీల లేఖను వదిలివెళ్లాడు గణేష్.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్, IME నెంబర్ ద్వారా గణేష్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.