Eluru: ఏలూరు మేయర్ పీఠం వైసీపీ కైవసం
Eluru: మొత్తం 50 డివిజన్లలో 47చోట్ల వైసీపీ గెలుపు * 3 డివిజన్లలో టీడీపీ విజయం
Eluru: అందరూ ఊహించిందే జరిగింది. ఏపీలో ఏ ఎలక్షన్ వచ్చినా విజయం వరించేది మాత్రం ఆ పార్టీనే. ఫ్యాన్ స్పీడ్‌కు ఏ పార్టీ జెండా అయినా గల్లంతవ్వాల్సిందే.. అనే రీతిలో ఫలితాలు ఉంటాయి. అదే విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. ఏలూరు కార్పొరేషన్‌లో వైసీపీ జెండా రెపరెపలాడింది. ఏలూరు మేయర్ పీఠాన్ని అధికార పార్టీ దక్కించుకుంది. మొత్తం 50 డివిజన్లకు గాను 3 ఏకగ్రీవాలతో కలిపి 47 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఏలూరు కార్పొరేషన్‌లోని మొత్తం 50 డివిజన్లలో ఫలితాలు వెల్లడయ్యాయి. 2వ డివిజన్, 4వ డివిజన్, 5, 10, 11, 14, 16, 17, 18, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 సహా మరికొన్ని డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. ఇక 28వ డివిజన్, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఇక వైసీపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేవు. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు. సీఎం జగన్ ఏపీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని, దానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ప్రజాతీర్పు వెలువడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పరిస్థితి అంతకంతకూ దారుణంగా తయారవుతుందని జోస్యం చెప్పారు పార్టీ నేతలు, కార్యకర్తలు.