విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తీర్చేంచేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు వాహనదారుల కష్టాలు తీర్చలేకపోతున్నాయి. విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం.
విజయవాడ నగరం మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. ఇంద్రకీలాద్రికి రెండు వైపులా, కృష్ణానదికి మరొకవైపు ఉంటుంది. NH5 జాతీయ రహదారి, మచిలీపట్నం-హైదరాబాదు జాతీయ రహదారి ఈ రెండూ నగరం మధ్యలోంచే వెళతాయి. భారీ నుంచీ అతిభారీ వాహనాలు కూడా నగరంలోని బెంజి సర్కిల్ నుంచే వెళతాయి. ఇక్కడ మచిలీపట్నం నుంచి, చెన్నై నుంచి, హైదరాబాదు నుంచి, కలకత్తా నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కలుస్తుంది దీంతో ఈ ప్రాంతంలో వాహనదారుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటాయి.
నగరంలో ట్రాఫిక్ కష్టాలు తొలగించాలని బెంజి సర్కిల్ ఇరువైపులా రెండు అతిపెద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టారు. ఒకవైపు పూర్తవడానికి 4 సంవత్సరాలు పట్టింది. రెండవ వైపు కూడా సూత్ర ప్రాయంగా ప్రారంభించారు కానీ భూ సమీకరణలో చిక్కులు వచ్చాయి. మరొకవైపు బడ్జెట్ సమీకరణాలతో కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కష్టాలతోనే నడుస్తోంది ఇక్కడ నిర్మాణం పూర్తయితే చాలావరకూ విజయవాడ నగర ట్రాఫిక్ ఇక్కట్లు తీరినట్టే
ఇక ఇంద్రకీలాద్రికి ప్రదక్షిణ చేస్తున్నట్టు కనిపించే కనకదుర్గ ఫ్లైఓవర్ దీనికి 13 సంవత్సరాల ప్లానింగ్ కష్టాలున్నాయి అడుగడుగునా బాలారిష్టాలే. దీనిని 22 నవంబరు 2015లో మొదలెడితే 15 సెప్టెంబరు 2020 నాటికి అనేక బాలారష్టాలు దాటుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా, ప్రారంభించాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అంతే మరోసారి వాయిదా పడింది. విజయవాడ నగరంలో ఫ్లైఓవర్లు నిర్మాణం పూర్తయినవి, నిర్మాణానికి నోచుకున్నవి కూడా అందుబాటులోకి వస్తేనే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం అయితే అటు హైదరాబాదు నుంచి వచ్చేవారికి, ఇటు నుంచి వెళ్ళేవారికి కూడా మార్గం సుగమం అవుతుంది.