Tirumala: స్వాములోరి బాకీ తీర్చేస్తారా...!
Tirumala: వైసీపీ సర్కార్ ఉన్నన్ని రోజులు ఆయన చేసిందే రైట్ చెప్పిందే శాసనం. జగన్‌కి అత్యంత ఆప్తుడు. కార్యక్రమం ఏదైనా ఆయన చేతితోనే ప్రారంభం అవుతుంది.
Tirumala: వైసీపీ సర్కార్ ఉన్నన్ని రోజులు ఆయన చేసిందే రైట్ చెప్పిందే శాసనం. జగన్‌కి అత్యంత ఆప్తుడు. కార్యక్రమం ఏదైనా ఆయన చేతితోనే ప్రారంభం అవుతుంది. వైసీపీ హయాంలో ఆయనను అందలం ఎక్కించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన ఆశీస్సులు ఉండాల్సిందే. జగన్ విశ్వసించిన వారిలో మొదటి వరుసలో ఆయన ఉంటారు. ఇప్పుడు ఆయనకే గడ్డుకాలం వచ్చిపడింది. ఇంతకీ ఆయనెవరు...? ఆయనకు వచ్చిన కష్టం ఏంటి...? కూటమి ప్రభుత్వం ఆయను ఇబ్బందులకు గురిచేస్తుందా.?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల ఆధ్యాత్మికతకు పుట్టినిళ్లు ఇల వైకుంఠం. దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తిరుమల గిరులకు చేరుకుంటారు. ఇప్పుడైతే టీటీడీ నిర్మించిన సత్రాలు, అతిథి గృహాలు, వీఐపీ గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో వసతి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ధర్మ ప్రచార వ్యాప్తి కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని పీఠాధిపతులకు తిరుమలలో మఠం ఏర్పాటు చేయాలని కోరింది. దాదాపు ఇప్పటికీ 30కిపైగా మఠాలు తిరుమలలో ఉన్నాయి.
హైందవాన్ని బోధించాల్సిన మఠాలు తిరుమలలో కల్యాణ మండపాలు, గదులను అధిక ధరలకు కేటాయిస్తున్నారని గతం నుంచి అనేక ఆరోపణలున్నాయి. ధనార్జనే ధ్యేయంగా తిరుమలలో మఠాల వ్యవహార శైలి ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గత ప్రభుత్వంలో టీటీడీలోని కొందరు అధికారులు వారి మాట చెల్లుబాటు అయ్యేలా మఠాలకు కావాల్సిన సౌకర్యాలను అందించారనే వాదనా ఉంది. దీని వల్లే తిరుమలలో మఠాల ఆగడాలకు అంతు లేకుండా పోతుందంటూ భక్తులు, కొందరు స్థానికులు విమర్శలు చేస్తున్నారు.
ఇదంతా ఓ ఎత్తు అయితే గత ప్రభుత్వంలో అనధికార సలహాదారుడిగా విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హిందూ ధర్మంలో ఎలాంటి సందేహాలు వచ్చినా ఆ స్వాములోరే ముందుండి పరిష్కరించేవారు. దీంతో ఆగమ సలహామండలి మాట కంటే స్వామీజీ మాటే అధికంగా చెల్లుబాటు అయ్యేది. స్వామీజీ నోటి వెంట వచ్చిన వాక్కే వాస్తవం అనేలా ప్రచారం సాగేది. ఆలయంలో చేయాల్సిన మార్పులకు స్వామి ఇచ్చే లేఖలే బ్రహ్మాస్త్రంగా పరిగణలోకి తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో ఆగమసలహా మండలికన్నా ముందే స్వామి వారి సిఫార్సు తీసుకునేవారు.
ఇదంతా అధికారుల వద్ద మెప్పు పొంది తనకు కావాల్సిన పనులు చేసుకునే వారంట స్వరూపానంద. ఇలా ఆయన తిరుమలలోనూ, విశాఖ సహా ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాలు వేద పాఠశాల కోసం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తిరుమలలో ధర్మప్రచారం, అనుగ్రహ భాసనం కోసం శారదా పీఠానికి స్థలం కేటాయిస్తే స్వరూపానంద ఆక్రమణలు చూసి స్థానికులు, అధికారులే నివ్వరపోతున్నారు.
కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి తిరుమలలో విశాఖ శారదపీఠం అక్రమ నిర్మాణాలు ఈ ఒక్క అంశం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిందు సమాజంలో హాట్ టాపిక్‌గా మారింది. 2005 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తిరుమలలోని గోగర్భం జలాశయ ప్రాంతంలో శారదా పీఠానికి 5 వేల చదరపు అడుగల భూమిని 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. టీటీడీ నిబంధనలు పాటించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ అధికారులు శారదా పీఠం నిర్వహకులకు సూచించారు. కానీ విశాఖ శారదా పీఠం నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. టీటీడీ ఇచ్చిన అనుమతి కన్నా విశాఖ శారదాపీఠం అక్రమ కట్టడాలకు పూనుకున్నట్లు రికార్డ్స్ ఆధారంగా తెలుస్తుంది.
వడ్డించే వాడు మనవాడు అయితే ఏ బంతిలో కూర్చుంటేనే అన్నట్లు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీద భవనాన్ని నిర్మిస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తిరుమల కొండమీద ఈ మఠందే హవా అన్నట్లు సాగింది. మఠంలో రెండు కల్యాణ మండపాలు, 20 గదులు ఉన్నాయి. మంచి డిమాండ్ ఉన్న మఠం కావడంతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.
2007లో చేపట్టిన తొలి నిర్మాణంలోనే అడ్డగోలుగా వ్యవహరించింది శారదాపీఠం. మఠం రద్దీగా ఉండటంతో విస్తరించాలని ప్రణాళిక చేశారు. తొలి భవనాన్ని విస్తరించే క్రమంలో 2023లో చేపట్టిన నిర్మాణాల్లోనూ అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ కాక మరో మూడు ఫ్లోర్లకు మించి తిరుమల కొండమీద నిర్మాణాలు సాగరాదన్నది పర్యావరణ నిబంధనలు ఉన్నాయి.
శారదా పీఠం మాత్రం మరొక అంతస్తు అదనంగా కట్టింది. వీటిల్లో మరో 38 గదుల నిర్మాణం సాగింది. ఇప్పటికే 70 శాతం నిర్మాణం పూర్తి అయింది. ఈ గదులు కూడా అందుబాటులోకి వస్తే దాదాపు 60 గదులతో భారీ వ్యాపారమే సాగేది. ఇక మఠం ముందున్న స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని పది కార్లు పట్టేలా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మారిన అనంతరం ఆక్రమణలపై ఇటు కూటిమి సర్కార్, అటు పార్టీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్ద స్వాములోరుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం నుంచే ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. నిర్మాణానికి 4 అంతస్తుల అనుమతి ఉంటే 6 అంతస్తులు అక్రమంగా నిర్మాణం చేపట్టారు. ఫైర్ సేఫ్టీకి ఒక్క అడుగు కూడా కట్టడంలో ఇవ్వలేదని సమాచారం. ప్రమాదం జరిగి భక్తుల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.
ఈ అక్రమ కట్టడాలను టీటీడీ ఎందుకు కూల్చడం లేదని జనసేన నాయకులు నిలదీస్తున్నారు. అప్పటికే అనేక ఆరోపణలు విమర్శలతో వార్తల్లో నిలిచిన శారదాపీఠం వ్యవహార శైలిపై కూడా కూటమి నాయకులు దృష్టి సారించారు. దీనిపై ఎన్డీయే ప్రభుత్వం కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానుసారం విశాఖ శారదాపీఠంకి గత ప్రభుత్వం ఇచ్చిన భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో అక్రమంగా విశాఖ శారదా పీఠం నిర్మించిన మఠం కూలుస్తారా...? ఆస్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందా? ఇదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. శారదా పీఠం భవన నిర్మాణ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని కూల్చి వేయడానికి సాసిస్తారా? ప్రస్తుతం టీటీడీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఈ పరిస్థితుల్లో పీఠాధిపతులు నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.