కామెడీతో కితకితలు పెట్టే సినీ నటుడు అలీకి, కొత్త రోల్ రెడీ అవుతోందా? అమరావతిలో సీఎం జగన్‌తో మీటింగ్‌లో ఆ మేరకు చర్చ జరిగిందా? ఇంతకీ అలీకి పార్టీ పదవి ఇస్తున్నారా? లేదంటే నామినేటెడ్ పోస్టు అప్పగించే చాన్సుందా? సీఎం జగన్‌తో, అలీ సమావేశం ఆంతర్యమేంటి?
ఎన్నికల టైంలో తన మిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన కమెడియన్ అలీ, మరోసారి హెడ్‌లైన్ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ను అలీ కలవడంతో, వీరిద్దరి భేటి వెనక ఆంతర్యమేంటి? రాబోయే రోజుల్లో అలీని కొత్త పాత్రలో చూడబోతున్నామా అన్న చర్చ షురూ అయ్యింది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున ప్రచారం చేసిన అలీ, శాసనసభ సీటు కోసం విశ్వప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సీట్లన్నీ రిజర్వ్ కావడంతో, పార్టీకి ప్రచారం చేయడం వరకే బాధ్యత తీసుకున్నారు. ఆ సమయంలో అలీకి జగన్ నామినేటెడ్ హామీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అలీ సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు అన్న ప్రశ్నలపై చాలా రకాల మాటలు వినపడ్తున్నాయి. ఇండస్ట్రీలో రెండు వర్గాలే రాజ్యమేలుతున్నాయని, కమ్మ, కాపు సామాజిక వర్గాలే శాసిస్తున్నాయని, ఇప్పుడు ఈ రెండింటితో రచ్చ పెట్టుకున్న అలీకి, సినిమా అవకాశాలు అందుకే తగ్గాయన్నది ప్రచారం. ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు వివరించినట్టుగా కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక తాను పూర్తిస్థాయిలో పార్టీకి, లేదంటే ఏ బాధ్యత అప్పగించినా చెయ్యడానికి సిద్దంగా వున్నానని జగన్‌కు అలీ చెప్పినట్టు తెలుస్తోంది.
పార్టీలోకి వచ్చిన టైంలో టికెట్ ఆశించి, నిరాశపడిన అలీకి, ఎలాగూ నామినేటెడ్ పోస్టు హామి వుండటంతో, ఆ దిశగా జగన్‌తో ఒకసారి మాట్లాడేందుకే వచ్చారా లేదంటే జగనే అలీని పిలిపించుకుని మాట్లాడారా అన్న విషయాలు పక్కనపెడితే, రాబోయే రోజుల్లో అలీకి అన్నీ హ్యాపీడేసే మాటలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అలీకి పార్టీ పదవి ఇస్తారా లేదంటే నామినేటెడ్ పోస్టా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుందని సమాచారం. ఇదిలా వుంటే, అలీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. ఇప్పటికీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తన తండ్రి పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలీ. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినా, రాజమండ్రిలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ఉన్నా రెండు స్థానాల్లో వైసీపీ ఓడిపోయింది. దాంతో పాటు టీడీపీ కంచుకోటగా ఉన్న రాజమండ్రిని వచ్చే ఎన్నికల నాటికి కైవసం చేసుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందన్నది విశ్లేషకుల మాట. ఇందులో భాగంగానే, రాజమండ్రి వాస్తవ్యుడైన అలీకి రాజమండ్రి నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జీ పదవి కట్టబెట్టి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ టికెట్ ఇవ్వాలన్నది అధిష్టాన పెద్దల ఆలోచనగా చర్చ జరుగుతోంది. తాజా భేటిలో అనేక అంశాలతో పాటు ఈ ప్రతిపాదన కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే, గతంలో ముస్లింలు అధికంగా వుండే గుంటూరులో ఓ సీటుపై పట్టుబట్టిన అలీ, రాజమండ్రి ఆఫర్‌కు సై అంటారా అన్నది చూడాలి.
మొత్తానికి చాలా రోజుల తర్వాత కమెడియన్ అలీ, సీఎం జగన్‌ను కలవడంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. నామినేటెడ్ పదవి ఇస్తే, ఏదిస్తారు మైనార్టీ విభాగాల్లో ఏదైనా అప్పగిస్తారా లేదంటే పార్టీలో పదవి కట్టబెడతారా రాజమండ్రి లేదా ఇతర ఏదైనా నియోజకవర్గానికి ఇన్‌చార్జీగా నియమించి, ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోమంటారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుందని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి. అలీ కోసం ఏ రోల్ సిద్దంగా వుందో.