నిన్నటివరకు ఆమె తిరుగులేని నేత అంతా ఆమె గెలిచి తీరుతారని భావించారు. భారీ స్థాయిలతో బెట్టింగ్‌లూ కాశారు. ఎందుకంటే ఆమె కుటుంబ చరిత్ర అలాంటిది. తాతకు తగ్గ మనవరాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. కానీ రిజల్ట్ డే రోజు, ఆమె జాతకం తిరగబడింది. గెలుస్తారని, సంబరాలకు సరంజామా సిద్దం చేసుకుంటే, ఓటమితో మొత్తం ప్లాన్ రివర్సయ్యిందని మథనపడిపోతున్నారు ఆమె అనుచరులు. గెలుపుపై ఇంత ధీమాగా ఉన్న ఆ నాయకురాలికి ఓటమి ఎందుకు ఎదురైంది ఫ్యామిలీ హిస్టరీ అంత పవర్‌ఫుల్‌గా ఉన్నా, పరాజయం ఆమెను ఎందుకు పలకరించింది?
విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట నియోజకవర్గం పేరు చెప్పగానే, టక్కున గుర్తోచ్చేది కోళ్ళ కుటుంబం. కొన్ని దశాబ్దాలు ఎస్ కోటలో తిరుగులేని పాలన చేసింది కోళ్ల ఫ్యామిలీ. 2009లో నియోజకవర్గల పునర్విభజనకు ముందు, ఉత్తరాపల్లి నియోజకవర్గంగా ఉండేది శృంగవరపు కోట. 1983లో తెలుగుదేశం ఆవిర్బావంలో ఉత్తరాపల్లి నుంచి టీడీపీ అభ్యర్దిగా బరిలోకి దిగారు మాజీ మంత్రి, రైతు నాయుకుడు కోళ్ల అప్పలనాయుడు. వరసగా ఐదుసార్లు గెలిచి సత్తా చాటారు. మంత్రిగానూ పదవులు పొందారు. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
2009 పునర్విభజన తర్వాత ఉత్తరాపల్లి నియోజకవర్గం పోయి, ఎస్ కోటగా ఆవిర్భవించింది. దీంతో కోళ్ళ అప్పలనాయుడు వారసరాలిగా రాజకీయ రంగప్రవేశం చేశారు మనవరాలు కోళ్ల లలిత కుమారి. వరసగా రెండుసార్లు ఎస్ కోట నుంచి గెలిచారు లలిత. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా, తాతకు తగ్గ మనమరాలిగాను గుర్తింపు తెచ్చుకున్నారారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.
ఎస్ కోట, కోళ్లకుటుంబానిదే అన్నట్టుగా సాగిన ప్రస్థానానికి 2019 సడన్ బ్రేక్ వేసింది. తాతకు తగ్గ మనవరాలంటూ శభాష్ అనిపించుకున్న లలిత, అనూహ్యంగా ఓడిపోయి, అందరికీ షాకిచ్చారు. ఇంత పేరున్న కోళ్ల కుటుంబానికి ఓటమి ఎందుకు ఎదురైందన్న ప్రశ్నకు, సవాలక్ష జవాబులున్నాయి.
అంతా తనవారే అనుకున్న లలితకు, అంతలోనే కానివారయ్యారు. అనునిత్యం నియోజకవర్గంలో ప్రజల మనస్సుల్లో ఉండే ఆమె, ఒక్కసారిగా అంతగా అభిమానాన్ని పోగోట్టుకోవడానికి ప్రధాన కారణం ఆమె చేసిన పొరపాట్లేనని, అందరూ అనుకుంటున్నారు. తన కుటుంబానికి, తనకు నియోజకవర్గంలో ఎదురులేదని అతివిశ్వాసంలో మునిగిపోయారు లలిత కుమారి. ప్రత్యర్థికి నియోజకవర్గంలో అసలు బలమే లేదని చాలా తక్కువగా అంచనా వేశారు. తాను తప్ప ప్రజలకు మరో ఛాయిస్ లేదని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో లెక్కలేశారు. గెలుపు ధీమాతో నియోజకవర్గంలోని క్యాడరును సైతం పట్టించుకోలేదని, సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. అందుకే టీడీపీకి తిరుగులేని, కోళ్ల కుటుంబానికి ఎదురులేని ఎస్ కోట, నో చెప్పేసిందని చర్చించుకుంటున్నారు.
ఎస్ కోట నుంచి మూడోసారి గెలిచి, లలిత కుమారి, తాత చరిత్ర తిరిగరాస్తారని అంతా అనుకున్నారు. వైసీపీ నాయుకులు సైతం నియోజకవర్గంలో గెలుపుపై అంతగా అంచనాలు పెట్టుకోలేదు. దీంతో గెలుపు ఊహాలోకంలో తేలిపోయిన లలిత, జగన్ సునామీని గుర్తించలేకపోయారు. దీనికితోడు తాను చేసిన పొరపాట్లనూ విస్మరించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీ నేతలకు కాంట్రాక్టు పనులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారట తెలుగు తమ్ముళ్లు. దీనికి తోడు జామి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు చొరవ చూపకపోవడం, జామి అగ్రహారం భూముల సర్వేలో ప్రదర్శించిన నిర్లక్ష్యం, ఎస్.కోటలో ఇళ్ల స్థలాల కోసం పేదలు ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి మంజూరయ్యేలా చర్యలు చేపట్టకపోవడం, ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా లలిత కుమారి ఓటమికి ఎన్నో కారణాలు. మొత్తానికి అనుభవానికి మించిన పాఠంలేదని తీరిగ్గా ఆలోచిస్తున్నారట లలిత కుమారి. వచ్చే ఎన్నికల నాటికి తప్పొప్పులను సరి చేసుకుని, కసిగా పోరాడతామని అంటున్నారట.