బూడిద కోసం: జేసీ, ఆది మధ్య కొట్లాట ఎందుకు?

JC Prabhakar Reddy Vs Adinarayana Reddy: బూడిద కోసం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. యాష్ కోసం రెండు వర్గాలు పంతానికి వెళ్లాయి.

Update: 2024-11-28 13:19 GMT

JC Prabhakar Reddy Vs Adinarayana Reddy

JC Prabhakar Reddy Vs Adinarayana Reddy: బూడిద కోసం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. యాష్ కోసం రెండు వర్గాలు పంతానికి వెళ్లాయి. దీంతో కడప ఆర్టీపీపీ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు తమ వాహనాలను లోడింగ్ కాకుండా అడ్డుకుంటే కడపకు వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జేసీకి సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని ఆదినారాయణ రెడ్డి వర్గం సవాల్ విసిరింది. ఈ పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఇద్దరిని అమరావతికి రావాలని సీఎంఓ నుంచి సమాచారం అందింది.

అసలు ఏం జరిగింది?

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీ పీపీ లో ఉత్తత్తి అయిన పాండ్ యాష్ లోడింగ్ కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు చెందిన వాహనాలను నిలిపివేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కొడుకు భూపేష్ రెడ్డి వర్గీయులు ఈ వాహనాలను నిలిపివేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నవంబర్ 26న జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. తమ వాహనాలు లోడింగ్ కాకుండా అడ్డుకుంటే రంగంలోకి దిగుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వస్తే అడ్డుకునేందుకు సిద్దమయ్యారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి నుంచి ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో మూడు చెక్ పోస్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

పాండ్ యాష్ అంటే ఏంటి?

విద్యుత్ తయారీ కోసం బొగ్గును కాల్చిన తర్వాత బూడిద వస్తోంది. దీన్ని ఫ్లైయాష్ అంటారు. దీంతో పాటు తడి బూడిద కూడా వస్తోంది . దీన్ని పాండ్ యాష్ అని పిలుస్తారు. ఫ్లైయాష్ కోసం జెన్ కో టెండర్లు పిలుస్తోంది. ఈ టెండర్ దక్కించుకొన్న కాంట్రాక్టర్లు ఫ్లైయాష్ ను సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తుంటాయి. అయితే పాండ్ యాష్ ను కూడా సిమెంట్ కంపెనీలు ఎక్కువగా వాడుతున్నాయి. పాండ్ యాష్ ను ఉచితంగా తీసుకోవచ్చు.సిమెంట్ కంపెనీలు పాండ్ యాష్ కోసం ప్రొవిజన్ ఆర్డర్ ను ఇస్తాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు పాండ్ యాష్ సరఫరాకు ప్రొవిజన్ ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆర్టీపీపీ నుంచి బూడిదను సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు.

కోట్లు కురిపించే బూడిద

ఆర్టీపీపీ లో ప్రతి రోజూ సుమారు 5 వేల టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. పాండ్ యాష్ ను సిమెంట్ కంపెనీలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ యాష్ ను సిమెంట్ కంపెనీలకు,బ్రిక్స్ తయారు చేసే సంస్థలకు సరఫరా చేస్తున్నారు. టన్నుకు రూ. 550 చొప్పున సిమెంట్ ఆధారిత పరిశ్రమలు చెల్లిస్తాయని చెబుతున్నారు. ఒక్క లారీలో కనీసం 60 నుంచి 70 టన్నుల పాండ్ యాష్ ను సరఫరా చేయవచ్చు. ప్రతి రోజూ ఒక్క ట్రక్కు లేదా లారీ నాలుగు ట్రిప్పులు పాండ్ యాష్ ను ఆర్టీపీపీ నుంచి తరలిస్తుంది. ఒక్క లారీలో 60 టన్నుల యాష్ తరలిస్తే సుమారు 18 నుంచి 20 వేలు ఖర్చు అవుతోంది. ఒక్క ట్రిప్పు పాండ్ యాష్ సరఫరా చేస్తే ఖర్చులు పోను కనీసంగా రూ. 15 వేలు మిగులుతుంది. ఒక్క లారీ నాలుగు ట్రిప్పులు నడిస్తే ఒక్క రోజుకు రూ. 60 వేలు ఆదాయం. ఎలాంటి ఖర్చు లేకుండా రోజుకు వేలల్లో ఆదాయం వస్తుంది.

అసలు వివాదం ఎందుకు?

సిమెంట్ కంపెనీలు యాష్ ను తామే సరఫరా చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు డిమాండ్ ను తెరమీదికి తెచ్చారు. అయితే ఇప్పటివరకు యాష్ సరఫరా కోసం జమ్మలమడుగుకు చెందిన లారీలను ఉపయోగించుకోబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తేల్చి చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి చెందిన లారీలు యాష్ లోడింగ్ కోసం ఆర్టీపీపీకి పంపితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య పలు దఫాలు చర్చలు కూడా జరిగాయి. కానీ, ఇరువర్గాలు మాత్రం ఏకాభిప్రాయానికి రాలేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులకు 60 లారీలు.. తాము 40 లారీలు నడుపుతామని జేసీ వర్గం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై ఉద్రిక్తతలు నెలకొంది. ఆర్టీపీపీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు సీరియస్

నాలుగైదు రోజులుగా ఆర్టీపీపీ నుంచి యాష్ తరలింపు విషయమై ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయమై మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 27న స్పందించారు. సీఎంఓ, కడప జిల్లా అధికారులతో మాట్లాడి వివాదం గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే సహించేది లేదని చంద్రబాబు చెప్పారు.ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలను నవంబర్ 29న అమరావతికి రావాలని సీఎంఓ నుంచి నవంబర్ 28న సమాచారం పంపారు. ఈ విషయమై ఇద్దరు నాయకులతో చంద్రబాబు మాట్లాడుతారని సమాచారం. ఎలాంటి ఖర్చు లేకుండానే కోట్లలో ఆదాయం వస్తుంటే రాజకీయనాయకులు బూడిదపై కన్నేశారని రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ చెప్పారు. ఈజీ మనీ కోసం బూడిద పనికొస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఇద్దరు నాయకులను పిలిచి రాజీ చేసి పంపడం మినహా ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని బూడిద వ్యవహారం గుర్తు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు సి. కృష్ణాంజనేయులు చెప్పారు. బూడిద కోసం ఇద్దరు నాయకులు బహిరంగంగా గొడవకు దిగిన పరిస్థితిపై గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చంద్రబాబు ఎందుకు ప్రజలకు సంకేతాలు ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News