రుతుపవనాలకు తోడైన అల్పపీడనం..ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు!
నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడనం తోడు కావడంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడనం తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజులు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఇవి కోస్తాంద్ర వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే దీనికి సంబంధించి మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కేవలం రుతువపనాల వల్ల అక్కడక్కడ మాత్రమే కురుస్తున్న ఈ వర్షాలు, దీనికి అల్పపీడనం తోడైతే మరింత విస్తరించే అవకాశం ఉందని చల్లని కబురు చెప్పడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఖరీఫ్ నారు మళ్లకు సంబంధించి విత్తనాలు వేసేందుకు దుక్కి చేసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏపీలో బుధ, గురువారాల్లో కోసాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన‌్నారు. మంగళవారం విశాఖ ఎయిర్ పోర్ట్, అనకాపల్లి, అరకులో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.