విశాఖ జిల్లాలో ఏసీబీకి చిక్కిన వీఆర్వో
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్ఓ).
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్ఓ). పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేయడంతో ఆ రైతు 14400 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకుని అరెస్టు చేశారు. విశాఖ జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన గల్లా సత్యనారాయణకు అదే గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 133/1లో 49.50 సెంట్ల భూమి ఉంది. అయితే ఈ భూమి వివరాలు ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గతంలో రెండు సార్లు తహసీల్దార్ కు దరఖాస్తు చేశాడు. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి గతేడాది డిసెంబర్ నెలలో భూమి వివరాలను ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పని చేసిపెట్టడానికి రూ.3 వేలు ఇవ్వాలని తాళ్లపాలెం వీఆర్వో పీవీ రాజేష్ సదరు రైతు సత్యనారాయణను డిమాండ్ చేశాడు. దాంతో విసుగెత్తిన సత్యనారాయణ ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 14400కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సత్యనారాయణ బంధువైన చప్పగడ్డ ప్రసాద్ ను వినితోగించుకున్నారు. అతని ద్వారా వీఆర్వో రాజేష్‌కు రూ.2 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకున్నారు. నగదు స్వాదీనం చేసుకొని రాజేష్ పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇవాళ అతన్ని కోర్టులో హాజరు పరచనున్నారు.