AP Budget: నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
AP Budget: దాదాపు రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్ రూపకల్పన
AP Budget: ఇవాళ ఏపీ ప్రభుత్వం మధ్యంతర పద్దు ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి అధికారులతో వారం రోజులుగా కసరత్తు చేసి రూపొందించారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్నప్పటికీ మూడు లేదా నాలుగు నెలల అవసరాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం పొందనుంది. బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు సెక్రటరియేట్‌లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ అంచనాలకు సంబంధించి డిసెంబర్‌లోనే అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రతియేటా బడ్జెట్ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి...గతేడాది 2 లక్షల 79 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు లేదా నాలుగు నెలలకు అవసరమైన అంచనాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదించనుంది.
ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం ఎనిమిది గంటలకు సచివాలయంలో ప్రత్యేకంగా కేబినెట్ భేటీ జరగనుంది.బడ్జెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ప్రతీ బడ్జెట్‌లోనూ సంక్షేమ పథకాలకు ఎక్కువ కేటాయింపులు చేసే జగన్ ప్రభుత్వం.. ఓటాన్ అన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో పథకాల కేటాయింపుల కంటే కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులు, ఇతర ప్రధాన అవసరాలకు సరిపడా అంచనాలను మాత్రమే అసెంబ్లీ ఆమోదించనుంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే సమావేశాల్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఆమోదం జరుగుతుంది.