Visakhapatnam hotels turn covid centres: కోవిడ్ కేర్ సెంటర్లు గా విశాఖలో హోటల్స్.. విజయవాడ ఘటన నేపధ్యంలో ప్రజల్లో ఆందోళన !
Visakhapatnam hotels turn covid centres: విశాఖ నగరంలోని హోటళ్లు ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్ కేర్ సెంటర్లుగా మారిపోతున్నాయి. వైరస్ బాధితుల భయాన్ని, ఆందోళనను ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలను ఫీజుల రూపంలో దండుకుంటురనే విమర్శలు వినబడతున్నాయి. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఘటనతో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమై టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
కరోనా వైరస్ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రులు కంటే మెరుగైన చికిత్స అందుతుందన్న భావనతో ఎగువ, మధ్య తరగతికి చెందినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. ప్రైవేటు ఆస్పత్రులు నగరంలోని కొన్ని హోటళ్లు, లాడ్జిలను అద్దెకు తీసుకుని వాటిని కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేశాయి. వైరస్ లక్షణాలు లేనివారు,
స్వల్పలక్షణాలతో బాధపడుతున్నవారిని ఈ కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. విజయవాడలో కొవిడ్ కేర్ సెంటర్‌గా నిర్వహిస్తున్న హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది చనిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరాపై వెంటనే తనిఖీల నిర్వాహణకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ కేర్ సెంటర్ల పేరుతో బాధితులను చేర్చుకుని చికిత్స అందజేస్తున్న హోటళ్లు, లాడ్జిల్లో రక్షణ ఏర్పాట్లు లేవని, కోవిడ్ విపత్తులను ప్రైవేటు ఆసుపత్రులు సోమ్ము చేసుకుంటున్నాయని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆరు వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, జీవో నెంబరు 77 అనుగుణంగా మాత్రమే రేట్లు వసూలు చేయాలని, అధిక రేట్లు వసూలు చేస్తే జిల్లా వైద్య అధికారికి ఫిర్యాదు చేస్తే, తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రామెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, కోవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ సుధాకర్ తెలిపారు.
కోవిడ్ సెంటర్లలో పేషంట్ల ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు నర్సింగ్ సిబ్బంది ఉదయం, సాయంత్రం వేళ వెళుతున్నారు. బాధితులు ఏవైనా సమస్యలు చెబితే డాక్టర్‌కి ఫోన్ చేసి చెబుతున్నారు. డాక్టర్ చెప్పేమందులను బాధితులకు అందజేస్తున్నారు. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా వుంటే అప్పుడు ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పేషంట్లకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని పలువురుకోరుతున్నారు.