మహిళలకు భద్రత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చర్యకు పూనుకుంది. ఇకపై విశాఖలో ఆటోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత మరింత పెరగనుంది.
ఆటోలలో ప్రయాణించే మహిళల భద్రత కోసం రవాణాశాఖ అభయ్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆటోలకు జీపీఎస్ అమర్చడం ద్వారా ఆటోవాలాలు, ఆటోల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను మోసం చేసే నేరస్తులకు చెక్ పెట్టెందుకు వీలవుతుంది. ఇందు కోసం విశాఖ నగరంలో ఆటోల్లో జీపీఎస్ తో పనిచేసే మీటర్లు అమర్చనున్నారు.
మహిళా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చకుండా దారి మళ్లించేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకొనేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. అఘాయిత్యాలకు పాల్పడే సమయంలో ఆటోల్లో ఉండే అత్యవసర బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా మీటరు నుంచి పెద్ద శబ్ధంతో కూడిన సైరెన్ మ్రోగుతుంది. అటో కొంత దూరం వెళ్ళి ఆగిపోవడంతో పాటు సమీపంలో ఉన్న గస్తీ పోలీసులు కూడా అప్రమత్తం అవుతారని పోలీస్ అధికారులు చెబుతున్నారు.