తిరుపతి జిల్లా రంగంపేటలో వెరైటీ నిరసన
*వైసీపీ లోకల్ లీడర్స్ వర్గపోరులో రోడ్డెక్కిన మూగజీవాలు
Tirupati: ఏదైనా నిరసన తెలిపాలంటే రకరకాల మార్గాలను ఎంచుకోవడం పరిపాటే. నిరహార దీక్షలు, శాంతియుత ర్యాలీలు, పువ్వులు అందజేయడం కామన్ కానీ తిరుపతి జిల్లాలో ఓ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన స్థానికుల నిరసన అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. చంద్రగిరి మండలం రంగంపేటలో స్థానిక వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. వీళ్లంతా ఎడ్లబండ్లపై ఇసుకను తరలిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. పొరుగు గ్రామం పుల్లయ్యగారి పల్లిలో రోడ్డు నిర్మాణ పనులకు ఇసుక తరలింపు వివాదానికి కారణమైంది. రోడ్డు పనుల కోసం ఎడ్ల బండ్లమీద వైసీపీకి చెందిన ఓ వర్గం ఇసుకను తరలిస్తోంది. వైసీపీలోనే స్థానిక ఎంపీటీసీ వర్గం అడ్డుచెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారితీయగా కోపంతో రగిలిపోయిన ఇసుకను తరలించే వాళ్లు బండ్లను వదిలేసి ఎడ్లతో రోడ్డుపై నిరసనకు దిగారు.
రోడ్డుకు అడ్డంగా మూగజీవాలను నిలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ఎద్దులు రోడ్డుపై ఉండిపోవడం చూసి అడ్డుగా వచ్చాయేమో అనుకున్నారు. కానీ, అంతలోనే విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. ఆ ఇదేం వెరైటీ నిరనసరా బాబు అని వాపోయారు. తిరుపతి-మదనపల్లి రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి నిరసన విరమింప చేశారు.
రంగంపేట గ్రామం జల్లికట్టుకు పెట్టింది పేరు. యేటా సంక్రాంతి నాడు ఎడ్ల పండుగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు గ్రామం అంతా ఎడ్ల పందాలతో సందడిగా ఉంటుంది. ఇలా రోడ్డుపై ఎడ్లతో నిరసనకు దిగగా కొందరు ఏంటి సంక్రాంతి పండుగ అప్పుడే వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. ఎడ్లను ఇలా నిరసనలకు తీసుకొచ్చారని తెలుసుకుని వైసీపీ లోకల్ ఫైట్ లో ఈడో రకం వాడో రకం అనుకుంటూ వెళ్లిపోయారు.