శ్రీవారి భక్తులకు సేంద్రియ ఆహారం, 14 రోజులు 14 రకాల కూరగాయలతో వంటల మెనూ

TTD: * గో ఆధారిత వ్యవసాయం ఉత్పత్తులతో ప్రసాదం తయారీ * కృష్ణాష‌్టమి నాడు ప్రయోగాత్మక పరిశీలనకు టీటీడీ ఏర్పాట్లు

Update: 2021-08-26 04:34 GMT

శ్రీవారి భక్తులకు సేంద్రియ ఆహారం, 14 రోజులు 14 రకాల కూరగాయలతో వంటల మెనూ

TTD: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ 'సంప్రదాయ భోజనం' అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఐదు వేరువేరు ప్రదేశాల్లో ఈ ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. శ్రీవారి దర్శనార్థం ఏడుకొండలపైకి వచ్చిన భక్తుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి భక్తులకు విముక్తి లభించనుంది. ఇందుకోసం తిరుమలలో ఎస్వీ గెస్ట్ హౌస్ లో అవలంభించిన పాత పద్దతిని పాటించనున్నారు.

ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, పప్పుదినుసులు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో తయారుచేసిన ప్రసాదాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత అన్నప్రసాద వితరణతో పాటు గోఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో ప్రసాదం తయారు చేసి భక్తులకు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది.

కృష్ణాష్టమి సందర్భంగా 30న ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్‌ సూచనలతో ఈ కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. ఒకప్పుడు తిరుమలలో ఎస్వీ గెస్ట్ హౌస్ లో సంప్రదాయ భోజనాన్ని టీటీడీ కల్పించేది. అనివార్య కారణాల వల్ల ఈ పద్దతిని నిలిపివేశారు. మళ్ళీ ఇలాంటి పద్దతిని కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది.

14 రోజుల్లో 14 రకాల కూరగాయలతో వంటలు చేసి వడ్డించేలా మెనూ సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ఎస్వీ గెస్ట్ హౌస్ లో ప్రారంభించనుంది టీటీడీ. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే ఇలాంటి కార్యక్రమాలు టీటీడీ నిర్వహించడం శుభ పరిమాణం అంటున్నారు భక్తులు.

Tags:    

Similar News