TTD Chairman YV Subba Reddy: రూ.23.78 కోట్ల జిఎస్‌టి రద్దు చేయండి.. కేంద్ర ఆర్థిక మంత్రికి వినతి
TTD Chairman YV Subba Reddy | తరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్) విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30వ తేదీ వరకు బకాయి.
TTD Chairman YV Subba Reddy | తరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (ఎస్‌పిఎఫ్) విభాగానికి 2014, ఏప్రిల్ 1 నుంచి 2020 జూన్ 30వ తేదీ వరకు బకాయి ఉన్న రూ.23.78 కోట్ల జిఎస్‌టిని రద్దు చేయాలని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. జి ఎస్టీ రద్దు చేయడం వల్ల టీటీడీ కి మరింత ఆర్థిక బలం లభించి అనేక సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని శ్రీ సుబ్బారెడ్డి కోరారు.
పాతనోట్ల డిపాజిట్‌కు ఆదేశాలివ్వండి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించిన రూ.500/-, రూ.1000/- నోట్లను రిజర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి అనుమతించాలని శ్రీ వైవి.సుబ్బారెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2016, నవంబరు 8వ తేదీన రూ.1000/-, రూ.500/- నోట్లను రద్దు చేసినప్పటి నుంచి టిటిడి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి అనేక ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే భక్తులు ఆ తరువాత కూడా స్వామివారికి హుండీ ద్వారా రద్దు అయిన నోట్లు కానుకగా సమర్పిస్తూ వచ్చారన్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో భక్తులు ఈ నోట్లను హుండీలో సమర్పించకుండా నిరోధించే ఏర్పాట్లు టిటిడి చేయలేకపోయిందని ఆయన చెప్పారు. ఈ రకంగా భక్తుల నుండి 1.8 లక్షల రూ.1000/- నోట్లు, 6.34 లక్షల రూ.500/- నోట్లు హుండీ ద్వారా కానుకలుగా వచ్చాయన్నారు. అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతున్న టిటిడి హుండీ ద్వారా లభించే కానుకలకు పక్కాగా రికార్డులు నిర్వహిస్తోందని శ్రీ సుబ్బారెడ్డి మంత్రికి వివరించారు.
టిటిడి వద్ద నిల్వ ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా లభించే సొమ్ముతో మరిన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చని చెప్పారు. పాతనోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టిటిడి అనేకసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాసి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదని ఆయన వివరించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని టిటిడి వద్ద నిల్వ ఉన్న రూ.1000/-, రూ.500/- నోట్లను రిజర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు.